చిత్తూరు జిల్లా రొంపిచెర్ల హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న నాని అనే విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు.
రొంపిచెర్ల(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రొంపిచెర్ల హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న నాని అనే విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. ఈ మేరకు విద్యార్థి తల్లి శాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు... శాంతమ్మ- ప్రసాద్ దంపతులు కుటుంబ కలహాలతో 6నెలల నుంచి వేరువేరుగా ఉంటున్నారు. రొంపిచెర్ల మండలం వారణాసివారిపల్లెలోని పుట్టింట్లోనే శాంతమ్మ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. భర్త ప్రసాద్ సొంత ఊరైన పుంగనూరు మండలం ఒంటిమిట్ట గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు.
బుధవారం పాఠశాలకు వెళ్లిన నాని ఇంటర్వేల్ సమయంలో బయటకు వచ్చాడు. అదే సమయంలో మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నానిని కిడ్నాప్ చేయడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని శాంతమ్మకు తెలిపారు. ఆమె రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదుచేసింది. తన భర్త తరపు వ్యక్తులే తన కుమారున్ని కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.