
'మంత్రుల కాళ్లు కాదు ... బాబు కాళ్లు పట్టుకోండి'
రాష్ట్ర విభజన వద్దని కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకోవడం కాదని, ముందు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడును శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఎవరిని నమ్మించడానికి పార్లమెంట్లో పగటి వేషాలు వేస్తున్నారని టీడీపీ నేతలను ఆమె ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
చంద్రబాబుకు సహాయం చేయాలనుకేంటే మంచిదే చేయండని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈ సందర్భంగా హితవు పలికారు. చేతనైతే జగన్ను రాజకీయంగా ఎదుర్కొండి, అంతేకానీ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై మాత్రం దిగజారి వార్తలు రాయడం మంచిది కాదన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా కథనాలు రాస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వ్యాఖ్యాలను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు శోభానాగిరెడ్డి తెలిపారు.
విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సహకరించారని ఆరోపించారు. అలాంటి ఆయన ఇప్పుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏం సాధించబోతున్నారంటూ సీఎం కిరణ్ను ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి, జీవోఎంలో సభ్యుడు జైరాంరమేష్ కాళ్లు పట్టుకుని వేడుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు గతంలో కేంద్రానికి లేఖ ఇచ్చారు. దాంతో పార్టీ అధ్యక్షుడు అనుకూలమని లేఖ ఇచ్చిన బాబు కాళ్లు పట్టుకోకుండా కేంద్ర మంత్రులు కాళ్లు పట్టుకోవడం వల్ల ఏం లాభం ఉంటుందంటూ శోభానాగిరెడ్డి టీడీపీ నేతలను శుక్రవారం బహిరంగంగా ప్రశ్నించారు.