సోనియా కోవర్టు కిరణ్: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నయవంచకుడిలా సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రాష్ట్ర విభజనను సజావుగా జరిపించేందుకు సోనియాకు కిరణ్ కోవర్టుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను సీఎంగా ఉండగా రాష్ట్ర విభజన జరగదని ఇన్నాళ్లూ బీరాలు పలికిన కిరణ్.. ఏం జరుగుతుందో చెప్పలేనంటూ ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఒక పథకం ప్రకారం హైకమాండ్‌పై తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పించి.. ఉవ్వెత్తున ఎగిసిన సీమాంధ్ర ఉద్యమాన్ని క్రమక్రమంగా నీరుగార్చుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
‘‘ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ.. విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిస్తామని చెబుతున్నారు. అసలు తీర్మానం అసెంబ్లీకి వస్తుందని కిరణ్ కచ్చితంగా చెప్పగలరా? ఢిల్లీలో కేంద్ర మంత్రులు రోజుకొక మాట మాట్లాడుతున్నారు. దిగ్విజయ్‌సింగ్ హోంమంత్రి షిండేతో మాట్లాడి అసెంబ్లీకి తీర్మానం వస్తుందో లేదో చెప్తానంటారు! అసెంబ్లీలో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు, కేవలం చర్చ మాత్రమే జరుగుతుందంటారు. తీర్మానం చేసే అవకాశం లేదని లోకమంతా కోడై కూస్తూంటే... కిరణ్ మాత్రం అసెంబ్లీలో ఓడిద్దామంటూనే ఉన్నారు. ఇంత నయవంచకంగా సమైక్య ఉద్యమానికి తూట్లు పొడుస్తున్న విభజనవాదిని చూస్తున్నాం’’ అని మండిపడ్డారు.
కిరణ్ మేకవన్నె పులి
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగేటప్పుడు ఏమాత్రం నోరు మెదపకుండా... నిర్ణయం జరిగిన పదిరోజుల తర్వాత ఓ ప్రెస్‌మీట్ పెట్టి సమైక్యం గురించి గుండెలు బాదుకున్న రోజునే అదంతా డ్రామా అని తాము చెప్పామని పద్మ గుర్తు చేశారు. పైగా తాను గొప్ప బ్యాట్స్‌మెన్‌నంటూ, బ్రహ్మాస్త్రం సంధిస్తానంటూ ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు.
సమైక్య ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన సీఎం.. ‘మేకపోతును బలివ్వడానికి మేపిన చందం’గా ఉద్యమాన్ని ప్రోత్సహించి ఇప్పుడు బలిపీఠమెక్కించారని దుయ్యబట్టారు. ఉద్యోగులను వెళ్లి కేంద్ర కేబినెట్ బృందానికి సమస్యలు చెప్పుకోమన్నారంటే... సీఎం విభజనకు అంగీకరించినట్లే కదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమం పట్ల కిరణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మూడురోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచే అవకాశం ఉందని, కానీ, ఆయన ఆ ప్రయత్నం ఎందుకు చేయడంలేదని పద్మప్రశ్నించారు.