శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికపై ప్రారంభమైన సర్వే | sri ram sagar project Survey | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికపై ప్రారంభమైన సర్వే

Published Wed, Dec 18 2013 4:00 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

sri ram sagar project Survey

భైంసా, న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికతో నీటినిల్వ సామర్థ్యం నానాటికి తగ్గుతోంది. స్వర్ణ, కడెం, సాత్నాల, వట్టి, గడ్డెన్న, కొమురం భీమ్, ఎన్‌టీఆర్ సాగర్, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టులు జిల్లాలోనే ఉన్నాయి. ప్రధాన ప్రాజెక్టుగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పరిధి కూడా జిల్లాలో ఉంది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టులో భారీ స్థాయిలో పూడిక పేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1089.50 అడుగుల నీరు ఉంది. 112.02 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదలతో ప్రాజెక్టులో చెత్తాచెదారం చేరి నీటినిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీల నుంచి 90.31 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యం తగ్గి సాగు భూములకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది.
 
 ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పిలుచుకునే శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఏటా పూడిక వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టుతోపాటు మరో 11 ప్రాజెక్టులు నిర్మించింది. ఈ యేడు భారీ వర్షాలు ఉండడంతో ప్రాజెక్టులో నీరు కనిపిస్తుంది. వర్షాలు కురియకపోతే మహారాష్ట్ర ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు నిండే వరకు ఎస్సారెస్పీలోకి నీరు రాదు. అదేగనుక జరిగితే ఎస్సారెస్పీ ఎడారిగా మారుతుంది. ఇలాంటి తరుణంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ప్రాజెక్టుకు మహర్దశ చేకూరుతుంది. లేదంటే మహారాష్ట్ర నిర్మించే ప్రాజెక్టుల నుంచి ఏటా చెత్తాచెదారం వచ్చి చేరి రైతులకు సాగుకు కష్టమవుతుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని 18 లక్షల ఎకరాలు సాగు నీరు అందుతుంది. ఈ జిల్లాలకు తాగునీరు కూడా అందిస్తుంది.
 
 పూడికపై సర్వే..
 ఎస్సారెస్పీ పూడికపై ఎట్టకేలకు సర్వే ప్రారంభమైంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులను నిలువరించకపోయిన సర్కారు పూడిక సర్వేను ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం సోమవారం బాసరకు చేరుకుంది. మంగళవారం బాసరలోని గోదావరినదిలో పూడికపై ఈ బృందం సర్వే ప్రారంభించింది. ఏపీ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ హైదరాబాద్ బృందం సభ్యులు పాల్గొంటున్నారు. డీఈఈ ఉమాదేవి సారథ్యంలో 12 మంది బృందం సభ్యులు సర్వే నిర్వహిస్తున్నారు. మొదటిరోజు ప్రత్యేకంగా తీసుకొచ్చిన బోటింగ్ ద్వారా గోదావరిలో సర్వే నిర్వహించారు. బాసర చుట్టు పక్కల నదిపరీవాహక ప్రాంతంలో ఈ బృందం సర్వే నిర్వహిస్తుంది. ప్రత్యేక బోటు ప్రయాణిస్తున్న ప్రాంతాల్లో ఐదు మీటర్ల లోతులోని ఛాయాచిత్రాలను శాటిలైట్ ద్వారా తీసుకుని ల్యాబ్‌కు పంపించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. మొదటి రోజు కావడంతో కొంత ఆలస్యంగానే సర్వే ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 20 రోజుల్లోనే సర్వే పూర్తి చేసుకుని ల్యాబ్‌కు వెళ్లి సంబంధిత వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి పోచంపాడు వరకు ఈ బృందం పూడికపై సర్వే చేపట్టనుంది.
 
 నాలుగోసారి అధికారుల సర్వే..
 ఎస్సారెస్పీ పూడికపై నాలుగోసారి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 1984లో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నీటి సామర్థ్యం 112.02 టీఎంసీలు ఉంది. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ నివేదిక ప్రాజెక్టులో 21.17 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని నిర్ధారించింది. దీంతో నీటిమట్టం 90.13 టీఎంసీలకు పడిపోయింది. 2006లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ మరోసారి చేసి ప్రాజెక్టులో 32.06 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని ధ్రువీకరించింది. ఈ సర్వే నమ్మశక్యంగా లేదని అధికారులు రీ సర్వే కోసం 2008లో ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ఇప్పటివరకు స్పందన రాలేదు.
 
 ప్రస్తుత నీటి సామర్థ్యం 90 టీఎంసీలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారి లెక్కట ప్రకారమే 22 టీఎంసీల నీటి సామర్థ్యం తగ్గినట్టు తెలుస్తోంది. 2013లో మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే చేపట్టాక అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పూడిక తొలగిస్తేనే ఉత్తర తెలంగాణ కష్టాలు తీరుతాయి. లేదంటే ఇప్పుడు చేపట్టే సర్వే కూడా కాగితాలకే పరిమితం అవుతుంది. ప్రాజెక్టులో ఉన్న పూడికతో ఈయేడు భారీ వర్షాలు కురిసినా గేట్లు ఎత్తి బయటకు వదిలేశారు. సర్కారు మేల్కొని ప్రాజెక్టులో పూడిక తీయిస్తే మరింత నీటి నిల్వలు ఈ రబీ సీజన్‌లో రైతులకు ఉపకరించేవి. రైతుల భూములు సస్యశ్యామలం అయి ఉండేవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement