'చంద్రబాబు పులితోలు కప్పుకున్న నక్క'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారంటూ వచ్చిన కథనాలను వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. వీరిరువురు సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.
ప్రజలకు భరోసా కల్పించాలే వ్యవహరించాలే కానీ, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి వైఎస్ఆర్ సీపీ నేతలను తనవైపు తిప్పుకోవటం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. ఒకప్పుడు మనం ఎక్కడకు పోతున్నామని ప్రశ్నించిన చంద్రబాబే... ఇప్పుడు ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు పులితోలు కప్పుకున్న నక్క అని, మూడు నెలల్లో ఆయన బండారం బయటపడుతుందని అన్నారు.
ప్రతిపక్షం నిలదీస్తుందనే భయంతో దాన్ని లేకుండా చేయాలని చంద్రబాబు తపన పడుతున్నారన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకూ తాము పోరాడుతూనే ఉంటామన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల తరపున పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నేతలెవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడరన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకూ జగన్ వెంటే ఉంటామని వారు స్ఫష్టం చేశారు. ప్రలోభాల కోసమో, మరోదాని కోసమో .....ఒకరిద్దరూ వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఒకరిద్దరూ పార్టీ మారినంత మాత్రాన మిగిలినవారంతా అదే బాటలో వెళ్తారని కథనాలు రాయడం హాస్యాస్పదమన్నారు.