తెలంగాణలో గిరిజనం.. సీమాంధ్రలో దళితులు
Published Sun, Aug 4 2013 4:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
హైదరాబాద్: రాష్ట్ర విభజన సామాజిక వర్గాల నిష్పత్తిలో కూడా మార్పులకు కారణం కానుంది. తెలంగాణ, రాయలసీమ..ఆంధ్రా ప్రాంతాల్లో ప్రస్తుతం నివసిస్తున్న వివిధ సామాజిక వర్గాల జనాభాలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కొంతమేర హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల విషయంలో పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పాటయితే ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తితో పోలిస్తే ఈ రెండు సామాజిక వర్గాల్లో మార్పులు జరుగుతాయి.
తెలంగాణలో షెడ్యూల్డు తెగల(ఎస్టీ)కు చెందిన జనాభా నిష్పత్తి ఏకంగా రెండు శాతం పైగా పెరగనుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీల జనాభా మొత్తం జనాభాలో 7 శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అది 9.3 శాతానికి చేరనుంది. అంటే తెలంగాణ జనాభాలో సుమారు 10 శాతం మంది ఎస్టీలే ఉండనున్నారు. ఇక ఎస్సీల విషయంలో తెలంగాణలో వీరి జనాభా స్వల్పంగా తగ్గనుంది. ప్రస్తుత రాష్ట్రంలో 16.41 శాతం మంది ఎస్సీలుండగా, తెలంగాణ జిల్లాల వరకు లెక్కలు కడితే తెలంగాణలో వారి జనాభా 15.4 శాతం కానుంది. ఇక సీమాంధ్ర ప్రాంతాలలో ఎస్టీల సంఖ్య భారీగా తగ్గనుంది. ఇప్పుడున్న 7 శాతం ఎస్టీలు, ఆంధ్ర జనాభాలో 5.3 శాతానికి పడి పోనున్నారు. అదే ఎస్సీల విషయానికి వచ్చినప్పుడు అది 16.41 నుంచి 17.1 శాతానికి పెరగనుందని జనాభా లెక్కలు చెపుతున్నాయి. ఇదే ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుందని నిపుణులు చెపుతున్నారు.
అయితే, 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలకు 6.6 శాతం అంటే 7 శాతం విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా, 2001 కంటే ముందున్న 6 శాతం రిజర్వేషన్లనే కొనసాగిస్తున్నారు. ఎస్సీల విషయంలో కూడా 2001 లెక్కల ప్రకారం 16.1 అంటే 16 శాతం ఇవ్వాల్సి ఉండగా 15 శాతమే కల్పిస్తున్నారు. అయితే, కొత్త రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన ఈ రంగాల్లో రిజర్వేషన్లు మారితే తెలంగాణలో ఎస్టీలకు 9 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఆంధ్రలో ఎస్టీలకు 5 శాతం, ఎస్సీలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఇక చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే లెక్కల ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు జరిగితే, రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో మార్పులుండే అవకాశాల్లేవు. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఎస్టీలకు రెండు స్థానాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏ జిల్లాలో ఎక్కువ
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే ఎస్టీల జనాభా తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఆంధ్రలో విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. ఎస్సీల జనాభా ఆంధ్రలో గుంటూరులో ఎక్కువగా ఉండగా, తెలంగాణలో కరీంనగర్‌లో ఎక్కువ మంది ఎస్సీలున్నారు. ఆంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలో ఎక్కువగా ఎస్టీలుంటారు. ఎస్సీల విషయంలో ఆంధ్రలోని కృష్ణా జిల్లా విజయవాడ (అర్బన్)లో, తెలంగాణలో అయితే వరంగల్‌లోని హన్మకొండ మండలంలో ఎక్కువ గా ఉన్నారు.
Advertisement
Advertisement