అధిక భూములున్నా కౌలు తక్కువే
వచ్చే ఆదాయానికీ లెక్కల్లేవు
ధూపదీప నైవేద్యాలకూ నోచని జగన్నాథుడు
రథయాత్రలోనూ అపశ్రుతి
భక్తుల నుంచి తీవ్ర విమర్శలు
నిద్రావస్థలో దేవాదాయశాఖ
వీరఘట్టంలోని జగన్నాథుడు ఆగర్భ శ్రీమంతుడు. మెట్ట, పల్లపు భూములు, ఖాళీ స్థలాలతోపాటు.. ఏటా లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఇతరులు దర్జాగా అనుభవిస్తుండగా.. ఆయన మాత్రం కడు పేదరికం అనుభవిస్తున్నాడు. ఏడాదిలో ఓ పది రోజులు మినహా ఏనాడూ స్వామివారి ఆలనపాలనా చూసేవారు లేరు. ఇదీ వీరఘట్టం మండల కేంద్రంలో కొలువుతీరిన.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనే ఉన్న జగన్నాథస్వామి వారి చరిత్ర.
వీరఘట్టం: మండల కేంద్రంలోని ముచ్చర్ల వీధిలో కొలువు తీరిన జగన్నాథుడికి సుమారు 45 ఎకరాల విలువైన భూములున్నాయి. ఈ భూములను పలువురు వ్యక్తులకు కారుచౌకగా కౌలుకు తీసుకున్నారు. అలా అయినా ఏడాదికి సుమారు రూ. 3 లక్షలపైనే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో మేనేజరుకు రూ.1500, అర్చకులకు రూ. 4 వేలు, స్వీపర్‌కు రూ. 500, గుమస్తాకు రూ. 1000, కరెంటు బిల్లుకు సుమారు రూ. 1200 ప్రతి నెలా ఖర్చు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే జీతాలు, ఖర్చులు కలిపి ఏడాదికి సుమారు రూ. 90 వేల వరకు ఖర్చవుతోంది. ఖర్చులు పోను ఏడాది రూ. 2. 50 లక్షల మిగులు ఆదాయం కనిపిస్తోంది.
అయితే మిగిలిన ఆదాయం ఏమవుతోందో తెలియని పరిస్థితి ఉంది. ఈ విషయంపై అధికారులు కూడా నోరుమెదపడం లేదు. వాస్తవానికి కౌలుకు ఇచ్చిన భూములను ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్స్ చేయాలి. ప్రస్తుతం భూముల ధరలు పట్టణ ప్రాంతాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం పెరిగాయి. అయినా దేవాదాయ శాఖ కౌలుకు ఇచ్చిన ధరల్లో మాత్రం ఇప్పటి వరకు తేడా లేదు. స్వామివారికి కనీసం సరైన దీపధూప నైవేద్యాలూ అందడంలేదు. ఏటా రథోత్సవాల్లో అందరికీ గుర్తొచ్చే ఈ జగన్నాథుడిని.. ఉత్సవాల అనంతరం మరిచిపోవడం ప్రజలకు, దేవాదాయ శాఖ అధికారులకు పరిపాటిగా మారడం విచారకరం.
లోపాయికారి ఒప్పందంతో ఆదాయానికి గండి!
జగన్నాథస్వామి భూములను కౌలుకు తీసుకున్న వారితో దేవాదాయ శాఖ అధికారులు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని తక్కువ రేట్లకు కౌలుకు ఇచ్చినట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంవల్లే దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అభివృద్ధిని పట్టించుకోకుండా మిన్నకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ భూముల, ఆదాయ వివరాలను బహిర్గతం చేసి ఆలయ అభివృద్ధికి కమిటీలు వేసి జగన్నాథస్వామి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రథయాత్రలో భక్తుల ఆవేదన
కాగా, మండల కేంద్రంలో శనివారం జరిగిన తొలి రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథచక్రం విరిగి నడిరోడ్డుపై రథం సుమారు మూడు గంటల సేపు నిలిచిపోయింది. రథాన్ని తయారు చేయించడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, శ్రీమంతుడైన జగన్నాథ స్వామికి ఏమిటీ కష్టాలని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న కోవెల ఆలన పాలన ఎందుకు చూడడం లేదని ఈఓతో పాటు అర్చకులను నిలదీశారు.
అధికారుల నిర్లక్ష్యమే
మండల కేంద్రంలో శనివారం జరిగిన తొలి రథయాత్రలో జగన్నాథస్వామిని నడిరోడ్డుపై మూడు గంటల సేపు ఉంచారు. రథాన్ని పటిష్ఠంగా తయారు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు.
- బుక్కూరు దుర్గారావు,
వీరఘట్టం
ఆలయ ఆస్తులు వెల్లడించాలి
జగన్నాథస్వామి ఆలయ ఆదాయ, వ్యయాలను బహిర్గతం చే యాలి. కమిటీలను వేసి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ అధికారులు చొరవ చూపాలి. లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు.
- జామి లక్ష్మీనారాయణ, సర్పంచ్ ప్రతినిధి,
వీరఘట్టం