రాయల తెలంగాణ దిశగా కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఇదంతా పక్కాగా వేసుకున్న ముందస్తు పథకం ప్రకారమే జరుగుతున్నట్టు కన్పిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కేంద్రం ఈ రకంగా ఆలోచించడం దుర్మార్గమంటూ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. అంతా ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం మేరకే సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. ‘‘అసలు రాష్ట్రాన్ని విభజిస్తున్నదెందుకు? తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించడానికే కదా! మరి అలాంటప్పుడు ఇలా రాయల తెలంగాణ అంటూ రాయలసీమను ఎందుకు, ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారు? సీమకు మాత్రం సెంటిమెంట్ ఉండదా?’’ అంటూ ధ్వజమెత్తారు.
కర్నూలును తెలంగాణలో కలపాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై కూడా శ్రీనివాసులు ఆగ్రహం వెలిబుచ్చారు. సీమకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఏదో చెబితే అది సీమ ప్రజలందరి అభిప్రాయం అవుతుందా అని ప్రశ్నించారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టును ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే దానిపై ఆధారపడ్డ రాష్ట్రంలోని ప్రాంతాల పరిస్థితేమిటి? సముద్రం నీళ్లు తప్ప వారికి మరో దిక్కుండని పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి వాస్తవిక సమస్యలను అసలు పరిగణనలోకి తీసుకోరా?’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానం తీరును తీవ్రంగా నిరసించారు.