►యథాతథస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం
►వివరణ ఇవ్వాలని అధికారులకు నోటీసులు
►తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
హైదరాబాద్ : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.సాంబిరెడ్డి ఇంటి కూల్చివేతపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ కూల్చివేత వ్యవహారంలో యథాతథస్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సాంబిరెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి, తేలప్రోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉంగుటూరు తహసీల్దార్‌లకు నోటీసులు జారీ చేశారు.
తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేశారు. తన ఇల్లు పంచాయతీ స్థలంలో ఉందంటూ తన ఇంటిని కూల్చేసేందుకు గ్రామ పంచాయతీ నోటీసు ఇచ్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పంచాయతీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ తేలప్రోలు గ్రామానికి చెందిన సాంబిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ది గ్రామకంఠంలో ఉన్న ఇల్లని తెలిపారు. 50 ఏళ్లుగా ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే ఇల్లు గ్రామపంచాయతీ స్థలంలో ఉందని, దానిని ఖాళీ చేయకపోతే ఈ నెల 30న కూల్చేస్తామని ఈ నెల 27న పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న మరో ఇంటినిగానీ, గ్రంథాలయం జోలికి పంచాయతీ అధికారులు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా సాంబిరెడ్డికి మాత్రమే నోటీసు ఇచ్చారని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు.
సర్పంచ్ కావాలనే ఈ విధంగా కక్షసాధింపు చర్యలు పూనుకుంటున్నారని, ఇంటిని కూల్చాలన్న ఏకైక లక్ష్యంతోనే 30 నుంచి గ్రామంలో 144 సెక్షన్ విధించారని, గ్రామకంఠం అంటే పంచాయతీ భూమి కాదని గతంలో హైకోర్టు తీర్పు కూడా చెప్పిందని పొన్నవోలు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి సాంబిరెడ్డి ఇల్లు కూల్చివేత వ్యవహారంలో యథాతథస్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేశారు.