రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. కేవలం శుక్ర, శనివారాలే గడువు ఉండడంతో అటు మంత్రులు, ఇటు అధికారులు ఇక సమీకరణ అసాధ్యమేనన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
తాడికొండ/తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. కేవలం శుక్ర, శనివారాలే గడువు ఉండడంతో అటు మంత్రులు, ఇటు అధికారులు ఇక సమీకరణ అసాధ్యమేనన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో తొలి విడతలో భాగంగా, 31,205 ఎకరాల భూములు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
జనవరి 1 తేదీన సమీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 18,700 ఎకరాలకు మాత్రమే రైతులు తమ అంగీకార పత్రాలు అందజేశారు. ఈ నెల 14వ తేదీతో సమీకరణ గడువు ముగియనుండడంతో దీనిపై నియమితులైన ప్రత్యేక అధికారులు, దగ్గరుండి సమీకరణ పనులు చూస్తున్న రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆందోళనకు గురవుతున్నారు.
కేవలం ఈ రెండు రోజుల్లో 12,505 ఎకరాల భూములు ఎలా సమీకరించాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. దీంతో తొలివిడత సమీకరణ లక్ష్యం పూర్తి చేయడం అసాధ్యమని భావించిన అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సమీకరణ గడువు పెంచుతారా, లేక భూ సేకరణకు వెళతారా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు భూములు ఇవ్వబోమని అభ్యంతరం తెలుపుతూ 9.2 ఫారాలు అందజేస్తున్న రైతుల సంఖ్య గ్రామాల్లో పెరిగిపోతోంది. ఈ దశలో సేకరణకు దిగితే రైతుల నుంచే కాక అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాందోళనలు ప్రభుత్వాధినేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం.
పూర్తిస్థాయి వ్యతిరేకత
తాడేపల్లి రూరల్ : భూ సమీకరణ ప్రక్రియకు తాడేపల్లి మండలంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. గత నెల 12వ తేదీన ఇక్కడ సమీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 126 మంది రైతులు కేవలం 159.53 ఎకరాలు ఇచ్చేందుకు తమ అంగీకార పత్రాలు అందజేశారు. గ్రామాల వారీగా చూస్తే ఉండవల్లిలో 22 మంది రైతుల 19.73 ఎకరాలు ఇవ్వగా, దీనిలో 5.70 ఎకరాలు వివాదంలో ఉంది. పెనుమాకలో 88 మంది రైతులు 133.97 ఎకరాలు, తాడేపల్లిలో 16 మంది రైతులు 5.83 ఎకరాలు ఇచ్చారు. ఈ మండలంలోని అధిక శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు ఇవ్వడం లేదంటూ 9.2 దరఖాస్తులను అధికారులకు అందజేశారు.