
టిక్‌టాక్‌లో భాగంగా అడవిలోని ఓ ఎత్తయిన కొండపై జాతీయ జెండాను పెట్టి సెల్యూట్ చేస్తున్న మురళీ కృష్ణ
కలకడ మండలానికి చెందిన ఈ యువకుడి పేరు మురళీకృష్ణ. చంద్రగిరి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. టిక్‌టాక్ వీడియో తీసేందుకు ఆదివారం శేషాచలం అడవిలోకి వెళ్లాడు.. అక్కడ దారి తప్పాడు. ఆదివారం రాత్రంతా అడవిలోనే ఉండిపోయాడు. చివరికి అతను తన వాట్సాప్ ద్వారా స్నేహితులకు లోకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు పోలీసుల సాయంతో అడవిలోకి వెళ్లి సోమవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అతన్ని అడవి నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ లోగా భయంతో ఫిట్స్ వచ్చి మురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇదొక్కొటే కాదు.. చాలాచోట్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. టిక్‌టాక్ మోజులో పడుతున్న యువత తమ బంగారు భవిష్యత్‌ను చేతులారా నాశనం చేసుకుంటున్నారు.
సాక్షి, చంద్రగిరి: వినూత్న రీతిలో టిక్‌టాక్ చేద్దామని ఆలోచించిన ఓ విద్యార్థి అడవిలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సహ విద్యార్థులు, పోలీసులు స్పందించి అడవిలో గాలించి 15 గంటల తర్వాత ఆస్పత్రికి చేర్చారు. పోలీసులు, తోటి విద్యార్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కలకడకు చెందిన మురళీకృష్ణ చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మైక్రో బయాలజీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో టిక్‌టాక్ చేద్దామని ఉదయం 9గంటలకు సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఓ ప్రాంతంలో జాతీయ జెండాను నాటి సెల్యూట్ చేశాడు. మరొక చోట పెద్ద కొండపైకి వెక్కి మరో టిక్‌టాక్ చేసి తన సెల్‌ఫోన్‌లో భద్రపరుచుకుని తిరుగు పయనమయ్యాడు. దారి తప్పడంతో 5 గంటల పాటు అడవిలో తిరుగు తూ ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న స్నాక్స్, వాటర్ బాటిళ్లు ఖాళీ అవ్వడంతో పూర్తిగా నీరసించిపోయాడు. దిక్కుతోచని స్థితిలో రాత్రి 9 గంటలకు స్నేహితులకు ఫోన్ చేసి వాట్సప్‌లో లోకేషన్ షేర్ చేశాడు. వెంటనే విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంతో పాటు చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సీఐ రామచంద్రారెడ్డి ప్రత్యేక బృందాన్ని అడవిలోకి పంపించాడు.
నాలుగు గంటల తర్వాత
గూగుల్ మ్యాప్ ద్వారా మురళీకృష్ణ ఆచూకీ కోసం సుమారు నాలుగు గంటల పాటు పోలీసులు శ్రమించారు. చివరకు సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీవారిమెట్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో స్పృహ తప్పిన స్థితిలో మురళీకృష్ణను గుర్తిం చారు. పోలీసులు అతన్ని భుజాలపై సుమారు 5 కిలోమీటర్లు మోసుకొచ్చి 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. దీంతో ప్రాణ పాయం నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు తిరుపతికి చేరుకుని స్వగ్రామానికి తీసుకెళ్టినట్లు పోలీసులు తెలిపారు.
టిక్‌టాక్ వ్యసనంలో యువత
చిత్తూరు కలెక్టరేట్ : వయస్సు, లింగభేదం లేదు.. బాహ్య ప్రపంచంతో సంబంధం లే దు.. హావభావాలు, అభినయాలు, డ్యాన్సులు, విన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు.. ఇలా విభిన్నమైన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ లైక్‌లు, కామెంట్లు, ఫాలోవర్లను పెంచుకుంటూ ఇదే తమ లోకమంటూ గడిపేస్తున్నారు. సెలబ్రెటీల కన్నా తామేమీ తక్కువ కాదంటూ యువత నుంచి మధ్య వయస్సు కలిగిన వారు సైతం టిక్‌టాక్ మోజులో పడుతున్నారు. అదే మైకంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ యాప్ ఒక వ్యసనంగా మారింది. దీనిలో వీడియోలు అప్‌లోడ్ చేయడం వల్ల కలిగే దుష్ప్రచారాలతో అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవడమే కాక, మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
అధిక శాతం ఫోన్లల్లో టిక్‌టాక్ యాప్
ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో అధిక శాతం మంది టిక్‌టాక్ యాప్ ను వాడుతున్నారు. టిక్‌టాక్‌ను వేదికగా చేసుకుని వ్యక్తిగత నైపుణ్యాలను చాటుతున్న వారికి కొదవే లేదు. అదే సమయంలో అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తోంది. జిల్లాలో ఈ యాప్ వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. కొందరైతే గంటలతరబడి సెల్‌లో వీడియోలను వీక్షిస్తూ తమదైన లోకంలో విహరిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.
చదువును పక్కనపెట్టి..
చాలామంది విద్యార్థులు చదువును పక్కనపెట్టి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. ఈ సమస్యపై చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల, కళాశాలల నుంచి రాగానే పుస్తకాలను పక్కనపెట్టి సెల్‌ఫోనే లోకంగా కాలం గడిపేస్తున్నారు. పిల్లలు అప్‌లోడ్ చేసిన వీడియోలు, కామెంట్ల వల్ల ఎక్కడ వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనకు లోనవుతున్నారు. కొందరైతే తరగతి గదుల్లో తోటి విద్యార్థులను ఆటపట్టించడం, డ్యాన్సులు చేయడం, సినీ, రాజకీయ ప్రముఖులను అనుసరిస్తూ చేసిన వీడియోలను అప్‌లోడ్ చేయడం లాంటివి చేస్తున్నారు.
ప్రాణాలపైకి తెచ్చుకోవడం ఎందుకు?
టిక్‌టాక్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేసేందుకు యువత ప్రయత్నిస్తోంది. వినూత్నంగా విన్యాసాలు చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారని భావించి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీడియోలు తీసుకుంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో చేసే వీడియోలను అనుసరించి వాటిని స్వయంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల మెడ, ఎముకలు విరిగిపోయి తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంఘటన ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకుంది. కొందరు గోడలు దూకడం, చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగుతూ కిందపడడం, నిల్చోని బైక్‌లను నడపడం, నదులు, సముద్రాలు, ఎత్తయిన ప్రదేశాల్లో నిలబడి టిక్‌టాక్ కోసం వీడియోలు చేస్తూ గల్లంతైన వారు కోకొల్లలు.
తప్పు చేస్తే జైలుకే
టిక్‌టాప్ యాప్ ద్వారా యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోంది. సమాజంపై కనీస అవగాహన లేని వారు చేసే వీడియోలు అప్‌లోడ్ చేసి కటకటాలపాలవుతున్నారు. తెలంగాణ ప్రజలు అక్కడి ప్రజాప్రతినిధులను దుర్భాషలాడుతూ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన తిరువూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇతరుల ప్రతిష్టకు భంగం కల్గించినా, కామెంట్లు, వీడియోల రూపంలో అసభ్యకరంగా ప్రవర్తించినా దానిని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీని అనుసరించి టిక్‌టాక్‌లో అసభ్యకరంగా పోస్టుచేసే వారిని గుర్తించడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాదు.
ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది
సెల్‌ఫోనే జీవితంగా భావిస్తున్న యువత ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. రాత్రంతా సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి వివిధ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా విద్యార్థులు, యువత ఉన్నారు.
– డాక్టర్ సుధాకర్‌రెడ్డి, మానసిక వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment