రేపటి తరం శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సౌలభ్యాలను కల్పిస్తున్నాయని కలెక్టర్ దినకర్‌బాబు తెలిపారు.
విద్యార్థులూ శాస్త్రవేత్తలుగా ఎదగాలి
Published Sat, Aug 17 2013 3:42 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
సిద్దిపేట, న్యూస్‌లైన్: రేపటి తరం శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సౌలభ్యాలను కల్పిస్తున్నాయని కలెక్టర్ దినకర్‌బాబు తెలిపారు. మెదళ్లకు పదునుపెట్టి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన కోరారు. సిద్దిపేటలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, పాతూరి సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిద్దిపేట డివిజన్ నుంచి 318, జిల్లాలోని ఇతర చోట్ల నుంచి 50 కలిపి మొత్తం 368 రకాల ప్రదర్శనలు అందుబాటులో ఉంచారు. కార్యక్రమం ప్రారంభంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ ప్రతిభకు ప్రోత్సాహం, విస్తారమైన అవకాశాలుంటాయని భరోసా ఇచ్చారు. పరిశోధనలతోపాటు ఆరోగ్యం, విద్య వంటి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో సార్క్ దేశాలతో పోలిస్తే మన వెనుకబాటు వెలితిని పూడ్చాలని అభిలషించారు.
పల్లెటూళ్ల పిల్లలతోనే దేశం పురోగమించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లోని డిజిటల్ విద్యాబోధనను ప్రభుత్వ బడుల్లోనూ అమల్లోకి తేవాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను రోడ్ల నిర్మాణమంటూ మట్టి పాలు చేయకుండా సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు, వసతుల పెంపునకు వెచ్చించాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రసంగిస్తూ రాజీవ్‌గాంధీ హయాంలోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి సాధించిందని చెప్పారు. డీఈఓ రమేశ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల ప్రయత్నాలు కొత్తదనంతో సమాజ హితానికి దోహదపడేలా ఉండాలన్నారు. మానవ విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. ఆర్‌డీఓ ఎ.ముత్యంరెడ్డి, తహశీల్దారు గిరి, డిప్యూటీ ఈఓ మోహన్, ఎంఈఓ ప్రసూనాదేవీ, పబ్లిక్ రిలేషన్ కమిటి ప్రతినిధి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, మద్యపాన నిషేధ కమిటీ జిల్లా అధ్యక్షుడు సికిందర్ తదితరులు పాల్గొన్నారు.
వెరీ గుడ్.. వెరీనైస్...!
విద్యుత్, కాలుష్యం, ట్రాఫిక్, నీటి వనరులు, ప్రకృతి సంపద వంటి వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు రూపొందించిన ఉపకరణాల నమూనాలను కలెక్టర్, ఎమ్మెల్సీలు, ఇతర అతిథులు తిలకించారు. తరగతి గదులు, హాళ్లల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను వాళ్లు కలియ తిరుగుతూ చూశారు. కొన్నింటి వద్ద ఆగుతూ వాటి విశేషాలను కలెక్టర్ ఆరా తీశారు. బాల మేధావుల ప్రజ్ఞాశక్తిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. వెరీ గుడ్...వెరీ నైస్ అంటూ పలువురు బాలబాలికలను మెచ్చుకుని వెన్నుత ట్టేలా సంభాషించారు. వారితోపాటు ప్రేరణగా నిలిచిన టీచర్లను అభినందించారు.
Advertisement
Advertisement