ఎలచ్చన్లొ స్తే అంతేనమ్మా | Subsidised LPG cylinder cap to be raised to 12 | Sakshi
Sakshi News home page

ఎలచ్చన్లొ స్తే అంతేనమ్మా

Published Sun, Jan 19 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

Subsidised LPG cylinder cap to be raised to 12

 సాక్షి, ఏలూరు:‘ఉఫ్.. ఉఫ్.. ఈ కట్టెల పొయ్యితో చచ్చిపోతున్నాం. ఎంత ఊదినా మంట వచ్చి చావడం లేదు. అత్త య్యా.. నా వల్ల కావట్లేదు. మీరే వచ్చి వంట చేసుకోండి’ అంటూ ఆ ఇంటి కోడలు ఆపసోపాలు పడుతోంది.‘గ్యాస్ పొయిలు.. కరెంట్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిపై వంటచేసే అవస్థల నుంచి బయటపడ్డామనుకున్నాం. కానీ.. ఈ ప్రభుత్వం ఏంటో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను తగ్గించేసింది. మళ్లీ మనల్ని పాతకాలానికి నెట్టేసిందే కోడలా..’ అత్తగారి నిట్టూర్పు.
 
 ‘అంతేనా.. గ్యాస్ ధరలను కూడా ఈ ప్రభుత్వం పెంచేసింది కదా అత్తయ్యూ!’
 ‘అవునే అమ్మాయ్.. ఏం చేస్తాం. మనం ఎంతగా అడిగినా సర్కారోళ్లు పట్టించుకోవడం మానేశారు. ఇచ్చే తొమ్మిది సిలిండర్లయినా సరిగ్గా ఇస్తున్నారా అంటే అదీలేదు. ముందు అప్పుచేసి మనం సిలిండర్ కొనుక్కుంటే తర్వాత ఎప్పుడో సబ్సి డీ సొమ్మును బ్యాంకులో వేస్తామంటున్నారు. ఆ డబ్బు ఎప్పుడు వేస్తున్నారో.. ఎంత వేస్తున్నారో కూడా తెలీడం లేదు. ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూడాలంటే.. పట్నం వెళ్లి రావాలి. దీనికి ప్రయాణ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ బాధలు ఎలా తీరుతాయో తెలి యడం లేదు కోడలా..’
 
 ‘అత్తయ్యా.. అర్జెంటుగా రండి. టీవీ చూడండి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను నెలకు ఒకటి చొప్పున ఇచ్చేయూలని సోనియమ్మ కొడుకు రాహుల్‌గాంధీ అడిగారట. అందుకే ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారని టీవీలో చెప్పేస్తున్నారు’
 ‘అవునా..! మనం ఏడాదిగా ఎన్నోసార్లు అడిగాం. మన జిల్లావాళ్లు ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా కరగని వాళ్లు రాహుల్‌గాంధీ అడగ్గానే ఒప్పేసుకున్నారా’
 
 ‘అవునత్తయ్యా..!’
 ‘ఏదైతేనేం మనకు మూడు సిలిండర్లు పెరుగుతాయన్నమాట..’
 ‘ఏంటత్తయ్యా అలా అంటారు. పెట్రోల్ ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గించమని ఆ రాహుల్‌గాంధీ ఈ పాలకులకు చెబి తే పోలా. మీ మనవడికి ఫీజు రీయిం బర్స్‌మెంటు.. మావయ్యకు వృద్ధా ప్య పింఛను.. మొన్న వానలకు పాడైపోరుున పంటలకు నష్టపరిహారం.. దాళ్వా పంటకోసం మీ అబ్బాయికి బ్యాంకు లోను ఇమ్మని సోనియూగాంధీ కొడుకు చెబితే జనాలకు ఇంకా మేలు కలుగుతుందిగా..’ అంటూ జనం ఇబ్బందులను ఏకరువు పెట్టింది ఆ ఇంటి కోడలు.
 
 ‘మనకున్నట్టే ఎంతో మందికి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నా యి. ఇవేమీ పట్టింకుకోకుండా రాహుల్ సిలిండర్లు పెంచేయమన్నా రు.. పెంచేస్తాం అంటే సరిపోతుం దా. అయినా గతంలో ఎన్ని సిలిం డర్లు కావాలంటే అన్ని తీసుకునేవాళ్లం.. ఇలా పరిమితి పెట్టింది వాళ్లే కదా. అంటే మన నోటికాడ కూడు లాగేసుకుని.. గంజినీళ్లు పోస్తున్నారన్నమాట. రేట్లు పెంచేసి.. సబ్సిడీలు తగ్గించేసి.. ఎక్కువ సిలిండర్లు ఇచ్చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే వీళ్ల నాటకాలు అందరికీ తెలుసులే.. ఎలచ్చన్లు వచ్చేస్తున్నాయ్ కదా.. ఓట్ల కోసం ఇలాంటి మాటలు చెప్పేస్తున్నారు.. నా జీవితంలో ఇలాంటి నాటకాలు ఎన్ని చూళ్లేదంటావ్’ అత్తగారు రాజకీయ నేతల లోగుట్టు విప్పింది. 
 విస్తుపోవడం కోడలి వంతైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement