పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు 26 నుంచి సర్వే | Survey from 26 for identification of beneficiaries of Govt schemes | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు.. ఈ నెల 26 నుంచి సర్వే

Published Tue, Aug 13 2019 4:20 AM | Last Updated on Tue, Aug 13 2019 9:48 AM

Survey from 26 for identification of beneficiaries of Govt schemes - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అవసరం అన్నదానిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 26 నుంచి రాష్ట్రమంతటా సర్వే చేయనున్నారు. అలాగే, వైఎస్సార్‌ చేయూత పథకంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత ఉన్న 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను గుర్తించడం.. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా ద్వారా లబ్ధిపొందే వారి వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తారు. ఒకొక్క వలంటీరు తనకు కేటాయించిన 50 ఇళ్లలో రోజుకు ఏడు నుంచి పది ఇళ్ల చొప్పున ఐదు రోజుల పాటు ఇది ఉంటుంది. కాగా, ఆగస్టు 15న వలంటీర్లు విధులలో చేరిన తర్వాత అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే వరకు 45 రోజుల పాటు వారు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సోమవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

15న సీఎం చేతుల మీదుగా శ్రీకారం 
ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపికైన వలంటీర్లు అదేరోజు వారివారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీఎం కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో వీరు వీక్షించేందుకు అన్నిచోట్ల ఎల్‌సీడీలు ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈవోలను ఆదేశించారు.  

16–25 తేదీల మధ్య డేటా సేకరణ 
వలంటీర్లు విధుల్లో చేరిన వెంటనే తమకు కేటాయించిన 50 ఇళ్ల పరిధిలోని వ్యక్తుల సమగ్ర సమాచారంతో పాటు ఆ కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితి వంటి అన్ని అంశాలపై డేటా సేకరించాలని గిరిజాశంకర్‌ ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య రోజుకు పది కుటుంబాల చొప్పున ఈ సమాచారం నిర్ణీత ఫార్మాట్‌లో సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు.. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా ఇంటికే రేషన్‌ బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఆరంభించనున్నారు. పెన్షన్ల పంపిణీపై కూడా వీరు సెప్టెంబరు 1న జరిగే పంపిణీ కార్యక్రమంలో ఆయా సిబ్బంది ద్వారా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.  

కొత్త పింఛన్, రేషన్‌ కార్డు లబ్ధిదారుల ఎంపికపై శిక్షణ 
కొత్తగా పింఛన్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లకు అవసరమయ్యే శిక్షణను వచ్చే నెల 11 నుంచి 15 తేదీల మధ్య అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని గిరిజా శంకర్‌ అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 2న గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత వలంటీర్లు ప్రతీరోజు ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రజల నుంచి అందే వినతులను 72 గంటలలో పరిష్కరించేలా చేయడం.. పింఛన్ల పంపిణీ, కొత్తవి మంజూరుకు అర్హులను గుర్తించడం.. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని వలంటీర్లే నిర్వహించాల్సి ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement