
బాబూ.. తెలంగాణకు లేఖ ఇచ్చారుగా!
జాతీయ సమగ్రతా మండలి సమావేశం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాకౌట్ చేశారు.
* ఎన్‌ఐసీలో చంద్రబాబును నిలదీసిన షిండే
* అసహనంతో బాబు వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సమగ్రతా మండలి సమావేశం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాకౌట్ చేశారు. దీనికి కారణం.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రసంగిస్తున్న చంద్రబాబును.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆయన కేంద్రానికి రాసిన లేఖ గురించి హోంమంత్రి షిండే ప్రస్తావించటమేనని తెలియవచ్చింది. ఎన్‌ఐసీ సమావేశానికి హాజరైన చంద్రబాబు తనకు కేటాయించిన ఐదు నిమిషాల సమయాన్ని ఎజెండాలోని అంశాలపై మాట్లాడేందుకు వినియోగించుకున్న తర్వాత.. రాష్ట్రంలో పరిస్థితులను వివరించేందుకు మరో రెండు నిమిషాల సమయాన్ని కేటాయించాలని అభ్యర్థించినట్లు తెలిసింది.
ఇందుకు సభాధ్యక్షుని అనుమతి కోసం వేచిచూడకుండానే.. కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని, ఎవరితోనూ సంప్రదించకుండా రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించినట్లు సమాచారం. షిండే జోక్యం చేసుకొని ఎజెండాలో లేని అంశాలపై ఎన్‌ఐసీలో చర్చ జరపటం సంప్రదాయం కాదంటూ ప్రసంగాన్ని ముగించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. అయినా చంద్రబాబు వినకపోవటంతో ఆర్థికమంత్రి చిదంబరం జోక్యం చేసుకుని తెలంగాణ అంశాన్ని మరో వేదికపై చర్చిద్దామని ప్రతిపాదించినట్లు సమాచారం.
అప్పటికీ చంద్రబాబు వినకుండా తన వాదనను కొనసాగిస్తుండటంతో షిండే మరోసారి కల్పించుకొని.. ‘చంద్రబాబు నాయుడు గారూ.. గతంలో మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు గదా! ఇప్పుడు ఇలా మాట్లాడతారేమిటి?’ అని నిలదీయటంతో పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఫక్కున నవ్వారని తెలిసింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన చంద్రబాబు రాష్ట్ర విభజన అంశంపై తానిప్పుడు ఎలాంటి కొత్త వైఖరిని చేపట్టటం లేదని చెప్పారని.. తెలుగు ప్రజల భవితవ్యానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించేందుకు అనుమతించకుండా తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నానని చెప్పి నిష్ర్కమించినట్లు తెలియవచ్చింది.
అయితే.. సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ఎన్‌ఐసీ అజెండాలో లేని అంశంపై మాట్లాడటాన్ని తప్పుపడుతూ ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి షిండేలు తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని తప్పుపట్టారు. రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితులు తొలిగించటానికి తాను మాట్లాడే ప్రయత్నం చేయగా సోనియాగాంధీ సైగలు చేశారని.. చిదంబరం, షిండేలు అడ్డుకున్నారని ఆరోపించారు.