గుంటూరు, న్యూస్‌లైన్ : సీఐల బదిలీలపై గుంటూరు రేంజ్‌లో ఉత్కంఠ నెలకొంది. నెలరోజులుగా రేంజ్ పరిధిలో బదిలీలపై విస్తృత ప్రచారాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఒకే సర్కిల్‌లో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐలు ఈ బదిలీల జాబితాలో ఉంటారనే ప్రచారం జరగడంతో పోలీస్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేంజ్ పరిధిలో 155 మంది పైగా సీఐలు ఉండగా.. వారిలో 15 నుంచి 20 మందికి బదిలీలు జరగవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు సీఐల పనితీరుతో పాటు ఆరోపణలపై కూడా నిశిత పరిశీలన సాగిస్తునట్లు సమాచారం.
గత అనుభవాల దృష్ట్యా..
గత అనుభావాల దృష్ట్యా ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఆచితూచి వ్యవహారిస్తున్నారు. ఆరోపణలకు తావులేకుండా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. గత సెప్టెంబరు నెలలో రేంజ్ పరిధిలో 44 మంది సీఐల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో ముడుపులు చేతులు మారాయని పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో డీజీపీ వి.దినేష్‌రెడ్డి జోక్యం చేసుకుని బహిరంగ విచారణ జరిపించారు. అదనపు డీజీ హుడాచే ప్రత్యేక బహిరంగ విచారణ చేయించారు. ఆరోపణలు వాస్తమమేనని తేలడంతో అప్పటి ఐజీ హరీష్‌కుమార్ గుప్తాపై బదిలీ వేటుపడింది. ఆ తరువాత జరిగే బదిలీలు భారీస్థాయిలో ఉండవచ్చని అందరు ఆశించగా అత్యవసరంగా కావాల్సిన సర్కిల్ పరిధిలో 23 మంది సీఐలను బదిలీ చేసి సర్దుకున్నారు.గుంటూరు రేంజ్‌లో సీఐల పరిధిలోని బదిలీలు అంటే తెనే తుట్టె కదిపినట్లేనని అధికారవర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగే బదిలీల్లో ఈ సంఖ్య 15 నుంచి 20 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. రెండు నెలల క్రితం 23 మంది సీఐలను బదిలీ చేశారు. రేంజ్ పరిధిలోని మూడు జిల్లాల్లో సీఐలను ఎస్‌హెచ్‌వోలుగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకు 200 కేసులు అధికం కావడంతో ఎస్‌హెచ్‌వోలుగా నియమించగా రేంజ్ పరిధిలో ఈ వీరి సంఖ్య 30పైగా ఉంది.
ఖద్దరు ఒత్తిళ్లు...
సీఐల బదిలీల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు జిల్లాల పరిధిలో ఖద్దరు మార్క్ ఒత్తిళ్లు పోలీసుశాఖపై అధికంగా ఉన్నట్లు సమాచారం. ఏకంగా కొందరు సీఐలు మంత్రులను అశ్రయించి కీలకమైన సర్కిల్‌లో పోస్టింగ్ కావాలంటూ వారి నివాసాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాబోవు ఎన్నికల నేపథ్యంలో వారికి అనుకూలమైన, వారి సామాజికవర్గాలకు చెందిన వారినే బదిలీలో అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు చేస్తునట్లు సమాచారం. ఇప్పటికే ఉన్నతాధికారులు సీఐల సర్వీసు రికార్డులను పరిశీలించి జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
సీఐల బదిలీలపై ఉత్కంఠ
Published Sat, Sep 14 2013 3:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement