
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు పొడిగింపు అంశం ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు ఉంది. ఆయన తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఒక పక్క బిల్లుపై చర్చకు గడువు పొడగించవద్దంటూ తెలంగాణ మంత్రులు రాష్ట్రపతికి లేఖ ఫ్యాక్స్ చేశారు. చర్చకు శాసనసభ సమావేశాల గడువు పొడగిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుందని వివిధ పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నేతలమంతా వచ్చి కలిసేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వమని తెలంగాణ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. మరో పక్క ఇప్పటికే మరో నెల రోజులు గడువు పొడగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు కోరారు. విభజనను అడ్డుకునేందుకే వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పొడగించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి రాసిన లేఖను కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.