స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పించాలి
నెల్లూరు (బాలాజీనగర్): ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై విద్యార్థులు తమ తల్లిదండ్రలకు అవగాహన కల్పించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై నెల్లూరులోని పురమందిరంలో సన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పరిసరాల పరిశుభ్రతపై చర్చించుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రధాని చేపట్టిన స్వచ్ఛభారత్‌తో ఐదేళ్లలో దేశం అద్భుతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు.
దేశంలో ప్రస్తుతం 13 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. వీటికి రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందజేస్తున్న సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. అనంతరం ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వొమ్మిన నాగసతీష్, నరసింహం, సర్వేపల్లి రామమూర్తి, బలరామయ్యనాయుడు, ఈవీఎస్ నాయుడు, శింగంశెట్టి మురళీమోహన్, గుడి నారాయణబాబు, భవాని నాగేంద్ర ప్రసాద్, అలూరి శిరోమణి శర్మ, ఎం.భాస్కర్, మెట్టు రామచంద్రప్రసాద్, తమ్మినేని పాండు, టైగర్ మహమ్మద్ పాల్గొన్నారు.