సమైక్యవాదులపై ఎస్‌ఐ జులుం | T - note the passage of a peaceful protest on Saturday | Sakshi
Sakshi News home page

సమైక్యవాదులపై ఎస్‌ఐ జులుం

Published Sun, Oct 6 2013 3:09 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

T - note the passage of a peaceful protest on Saturday

 పరిగి, న్యూస్‌లైన్:  మండల పరిధిలోని కొడిగెనహళ్లి వద్ద ప్రధాన రహదారిపై టీ-నోట్ ఆమోదానికి నిరసనగా శనివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమైక్యవాదులపై ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ దాడి చే శారు. బాధితుల కథనం మేరకు.. కొడికొండ-అమరాపురం ప్రధాన రహదారిపై ముళ్లకంపలు వేసి విద్యార్థులు, యువకులు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.
 
 ఆ సమయంలో పోలీసు జీపులో వచ్చిన ఎస్‌ఐ, రోడ్డుపై ఉన్న వలీ అనే యువకుడి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ నిర్దాక్షిణ్యంగా చితకబాదారు. మిగతా వారిని సైతం తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో ఎస్‌ఐ అక్కడ నుంచి జారుకున్నారు. వందలాది మంది గ్రామస్తులు రహదారిపైకి చేరుకుని ఎస్‌ఐ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. బాధితుడు వలీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అలాంటి వ్యక్తిపై ఎస్‌ఐ వీధి రౌడీలా ప్రవర్తించడం ఏ మాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసు స్టేషన్‌ను ముట్టడించాలని చర్చించుకున్నారు.
 
 అయితే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించాలని తిరిగి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ‘ఎస్‌ఐ డౌన్ డౌన్, పోలీస్ జులుం నశించాలి’ అంటూ  నినాదాలు చేశారు. అనంతరం కొందరు సమైక్యవాదులు నేరుగా ఎస్‌ఐకు ఫోన్ చేసి మీ తీరు బాగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ ఇక్కడకు వచ్చి క్షమాపణలు చెప్పాలని యువకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో ఇద్దరు పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement