విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాల్సిన ప్రభుత్వమే వారి పాలిట శాపంగా పరిణమిస్తోంది! తాము చేరదలచిన కాలేజీల్లో బోధనా ప్రమాణాలు, సదుపాయాల వివరాలను తెలుసుకునేందుకు ఉపకరించే టాస్క్‌ఫోర్స్ నివేదికను తొక్కిపెట్టి అంధకారంలోకి నెడుతోంది.
కళాశాల పై కలవరం
Published Sat, Aug 10 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాల్సిన ప్రభుత్వమే వారి పాలిట శాపంగా పరిణమిస్తోంది! తాము చేరదలచిన కాలేజీల్లో బోధనా ప్రమాణాలు, సదుపాయాల వివరాలను తెలుసుకునేందుకు ఉపకరించే టాస్క్‌ఫోర్స్ నివేదికను తొక్కిపెట్టి అంధకారంలోకి నెడుతోంది. ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్ ఎట్టకేలకు ఈనెల 19వ తేదీన ప్రారంభంకానుండటంతో విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతున్నా ఏ కళాశాలలో చేరాలన్న సందిగ్ధం వారిని వెంటాడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 717 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 3.4 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. నూటికి నూరుపాళ్లు నిబంధనలు పాటించే సక్రమమైన కళాశాలలు వీటిలో పట్టుమని పది కూడా లేవు. సాక్షాత్తూ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ నివేదిక తేల్చిన సత్యమిది. ఈ నివేదిక బహిర్గతమైతే ఏ కళాశాల నిబంధనలు పాటిస్తోంది? ఎందులో ఫ్యాకల్టీ బాగున్నారు? ఎక్కడ నాణ్యమైన బోధన అందుతోంది? తదితర అంశాలన్నీ వెలుగులోకి వచ్చేవి. వీటిని బేరీజు వేసుకుని విద్యార్థులు తగిన కళాశాలను ఎంచుకునే అవకాశం లభించేది. కానీ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను కాలరాస్తూ కళాశాలలకే పెద్దపీట వేస్తూ ఈ నివేదికను తొక్కి పెట్టింది. ఫీజులు పెంచడంలో ఉదారంగా వ్యవహరించిన సర్కారు కళాశాలల లోగుట్టు మాత్రం విద్యార్థులకు తెలియకుండా జాగ్రత్తపడింది.
ఫీజులని బట్టి నాణ్యత చెప్పలేం..!
గత ఏడాది ఇంజనీరింగ్ ఫీజు రూ. 35 వేలుగా ఉన్న 90 కళాశాలల్లో ఈసారి ఫీజులు ఏకంగా రెట్టింపయ్యాయి. అగ్రశ్రేణి కళాశాలల్లో దాదాపు 40 శాతం వరకు ఫీజులు పెరిగిన ఉదంతాలున్నాయి. 259 కళాశాలలకు రూ. 35 వేలుగా ఫీజులను నిర్ణయించారు. 175 కళాశాలలకు రూ. 35,500 నుంచి రూ. 1,13,300 వరకు నిర్ధారిస్తూ ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. వ్యయ నివేదికలు ఇవ్వని 195 కళాశాలలకు మాత్రం సెప్టెంబరు 30వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నివేదికలు సమర్పించాలన్న షరతుతో అడహాక్ ఫీజుగా రూ.30 వేలు ఖరారు చేసింది. ఫీజుల పెంపు పూర్తి అశాస్త్రీయంగా ఉందని పత్రికలు ఎలుగెత్తి చాటినా ప్రభుత్వం స్పందించలేదు. ఫీజులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన నాణ్యమైన విద్య అందుతుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం 5 శాతం కళాశాలల్లోనే పూర్తి అర్హులైన బోధనా సిబ్బంది ఉన్నారని, దాదాపు 60 శాతం కళాశాలల్లో తగిన అర్హతలు లేని సిబ్బంది పని చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ తేల్చింది. బోధన సిబ్బంది, ల్యాబ్‌లు, తదితర మౌలిక వసతులు లేని పలు కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయని కమిటీ తేల్చింది. కళాశాలలవారీగా వసతులు, లోపాలను క్రోడీకరించింది. చాలా పేరున్న కళాశాలల్లో సైతం 20 శాతం ఉత్తీర్ణత కూడా లేదని వెల్లడించింది. 5 శాతం కళాశాలల్లో మాత్రమే ప్లేస్‌మెంట్లు అందుతున్నాయని బహిర్గతం చేసింది. అయితే ఈ నివేదిక వెల్లడైతే తమ కళాశాలల్లో అడ్మిషన్లు జరగవన్న భయంతో యాజమాన్యాలు ప్రభుత్వం ముందు సాగిలపడ్డాయి. వీటితో కుమ్మక్కైన ప్రభుత్వం నివేదిక బయటకు రాకుండా తొక్కిపెట్టి విద్యార్థుల నోట్లో మట్టికొడుతోంది.
వెబ్‌సైట్‌కూ దిక్కులేదు..
రాష్ట్రంలోని దాదాపు 687 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 30 శాతం విద్యాసంస్థలకు వెబ్‌సైట్‌కు కూడా దిక్కులేదు. బోధనా సిబ్బంది వివరాలు, అనుభవం, వేతనాలు, ల్యాబ్, లైబ్రరీ వసతి, రవాణా, హాస్టల్ వసతి తదితర వివరాలపై నిజాయితీగా వ్యవహరించిన కళాశాలలు చాలా తక్కువే. కొన్ని కళాశాలలకు అసలు వెబ్‌సైటే లేకపోవడం వాటి డొల్లతనాన్ని తెలియచేస్తోంది. ఇక మరికొన్ని కళాశాలలు అసత్య ప్రచారాలకు తెర తీశాయి. గత ఏడాది తాము వందలాది మందికి ప్లేస్‌మెంట్లు కల్పించామని బొంకుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేసి.. రెండు మూడు అడ్రస్‌లేని కళాశాలలకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తూ విద్యార్థులను వంచిస్తున్నాయి. పేరుకు రిక్రూట్‌మెంట్లు జరుపుతూ కనీసం ఒక్కరికి కూడా ప్లేస్‌మెంట్లు కల్పించలేని ఈ సంస్థలు వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారం ఇస్తున్నాయి.
స్వయంగా తెలుసుకోవడం మంచిది..
ఈనెల 19 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనటానికి ముందుగానే విద్యార్థులు తాము చేరాలనుకునే కళాశాలలకు స్వయంగా వెళ్లి పూర్వ విద్యార్థులను కలిసి సమాచారం తెలుసుకోవడం మంచిది. బోధనా సిబ్బంది, ల్యాబ్ వసతి, రవాణా, హాస్టల్ వసతి తదితర విషయాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అత్యధిక ఫీజులు ఉన్నంతమాత్రాన అక్కడ బోధన బాగుంటుందని భావించడం పొరపాటే. బోధనా సిబ్బంది అనుభవం, ఇతరత్రా విషయాలను పూర్వ విద్యార్థుల ద్వారా సేకరించాలి. ఇక ప్రభుత్వం ఇచ్చే ఫీజురీయింబర్స్‌మెంట్ కంటే ఎక్కువ ఫీజు చెల్లించే స్థోమత లేనప్పుడు రూ. 35 వేల ఫీజు కంటే ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలలను వెబ్ కౌన్సెలింగ్ సమయంలోనే గుర్తించి తగు నిర్ణయం తీసుకోవాలి.
Advertisement
Advertisement