తవ్వారు పల్లె టు ఫిలిం నగర్
పల్లెటూరులో పుట్టాడు.. సినిమా డెరైక్టర్ కావాలని కలలుగన్నాడు.. స్కూల్ ఎగ్గొట్టి హైదరాబాదుకు వెళ్లాడు. కాళ్లరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఫలితం లేదు. అయినా అలసిపోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. ఈ సారి డెరైక్ట్‌గా కథే రాసుకుని పోయాడు. చివరికి దర్శకుడిగా మారి కల సాకారం చేసుకున్నాడు. కృషి ఉంటే సాధించలేనిదేదీ లేదని యువతకు స్ఫూర్తినిస్తున్నాడు. ఆయనే ‘ప్రేమ ప్రయాణం’ సినిమా దర్శకులు, ఖాజీపేట మండలం తవ్వారుపల్లెకు చెందిన ఎస్.ఎస్. రవికుమార్. ఆదివారం తన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ పలకరించింది. తన సినిమా ప్రయాణ విశేషాలు ఆయన మాటల్లోనే..- న్యూస్‌లైన్, మైదుకూరు(చాపాడు)
పదో తరగతి నుంచే..
మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. నేను కూడా సినిమాలకు కథలు రాయగలను.. సినిమాలు తీయగలనని అప్పుడే అనుకున్నా. దీంతో ఎన్నోసార్లు తరగతులు ఎగ్గొటి హైదరాబాదుకు వెళ్లాను. స్టూడియోల చుట్టూ తిరగటం.. ఉండేందుకు డబ్బుల్లేక తిరిగి ఇంటికి రావటం జరిగేది. దీంతో ‘ముందు బాగా చదువుకో తర్వాత సినిమాలు చేద్దువుగానీ’ అంటూ నాన్న మందలించారు. ఎలాగోలాగా ఇంటర్ వరకు చదివా. ఆ తర్వాత ఇంట్లో చెప్పకుండానే హైదారాబాదుకు వెళ్లాను.
రాజశేఖర్, జీవితల ప్రేరణతో..
ముందుగా ఒక కథ రాసుకుని రాజశేఖర్, జీవితలకు విన్పించా. అనంతరం వారి సూచనలు, సలహాల మేరకు హైదరాబాదులోని ఫిల్మ్ ఇన్‌స్ట్యూట్‌లో చేరి శిక్షణ పొందాను. ఆ తర్వాత మామూలే. సినిమా అవకాశాల కోసం వేట మొదలెట్టా.
ఎనిమిదేళ్లు అసిస్టెంట్ డెరైక్టరుగా...
2004లో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన అనంతరం కొంతకాలానికి రోశిరాజు అనే దర్శకుడు వద్ద అసిస్టెంటుగా అవకాశం సంపాదించాను. అక్కడి నుంచి సభాపతి, నరేంద్ర, దేవిప్రసాద్, సముద్రలతో పాటు ఇంకా పలువరి దగ్గర 2012 వరకు పని చేశాను. హ్యపీ జర్నీ, బ్లేడ్‌బాబ్జీ, ఏకవీర, ఇంకా పలు చిత్రాలకు అసిస్టెంటు డెరైక్టరుగా పని చేశా.
ప్రముఖ ఆర్టిస్టులతో..
ఇటీవలే ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టులు గా ఉన్న పోసాని కృష్ణమురళి, నాగీనీడులతో పాటు హీరోగా మనోజ్ నందం, హీరోయిన్‌గా నీతూ అగర్వాల్, ఆర్టీస్టులుగా బస్టాఫ్ కోటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్, పొట్టిరాంబాబు, యాం కర్ ఫన్నీ, భానుశ్రీ, రమ్య చౌదరి ఇలా పలువురితో ప్రేమ ప్రయాణం చిత్రాన్ని తీశాను. మరికొన్ని కథలు రాస్తున్నాను.
వరుణ్ సందేశ్‌తో సినిమా..
యూత్ ఫాలోయింగ్ హీరో అయిన వరుణ్ సందేశ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు రవికుమార్ తెలిపారు. దీంతో పాటు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యువహీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు తెలిపారు.