
ఆ రెండు పార్టీలకే చెల్లు..
ఆ రెండు పార్టీలకే చెల్లు..
ముప్పాళ్ల, : పార్లమెంటులో గురువారం చోటుచేసుకున్న సంఘటనలు దేశచరిత్రకే మాయనిమచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకే పార్టీలో ఉంటూ కొందరు ఒకలా.. మరికొందరు మరోలా వ్యవహరించడం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకే చెల్లిందని ఎద్దేవాచేశారు. ఒకరు సమర్థిస్తే మరొకరు వ్యతిరేకిస్తారని,
ఇంకొకరు పెప్పర్ చల్లుతారని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారనీ ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకంలో భాగమేనని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో పెప్పర్ చల్లిన లగడపాటి రాజగోపాల్ ఇంతకు ముందే సోనియా, రాహుల్, ప్రధాని వంటి వారిపై పెప్పర్ చల్లి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అన్నారు. తమ పార్టీ ఎంపీలనే కట్టడి చేసుకోలేని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తుందని, ఇలాంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవాలని, అలాకాకుండా కాంగ్రెస్‌తో కలసి బిల్లును ఆమోదిస్తే దేశంలో రెండు పార్టీలకూ నూకలు చెల్లినట్టేనని చెప్పారు. జూలై 30వ తేదీనే ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నాయకులు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.