సాక్షి, ఒంగోలు: సంతనూతలపాడు (ఎస్సీ) నియోజకవర్గాన్ని టీడీపీ ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. ఈ వ్యవహారం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించింది.
ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన తెలుగుతమ్ముళ్లు అధినేతతో అమీతుమీకి సిద్ధపడుతున్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో చేరిన బీఎన్ విజయ్‌కుమార్‌ను పార్టీ తరఫున పోటీకి నిలపాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించి బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.దీనిపై సోమవారం సాయంత్రం కొందరు హైదరాబాద్ చేరుకుని టీడీపీ నేతలు సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహనరావును కలిశారు.
సీనియర్లు మౌనం..
ఎన్నికలొచ్చిన ప్రతీసారి పొత్తుల పేరిట చంద్రబాబు తన మిత్రపక్షానికి సంతనూతలపాడునే కేటాయించడం వెనుక మతలబేంటనేది ఆ పార్టీ శ్రేణులకు ప్రశ్నగా మిగిలింది. 1989, 1994, 2009లోనూ ఆ సీటును ఇతరులకే అప్పగించారు. అక్కడ గెలుపు నమ్మకం లేకపోవడంతోనే త్యాగం చేస్తున్నారా, లేక పార్టీ నేతల ఆధిపత్యపోరు నేపథ్యంలో సంతనూతలపాడు నేతలు, కార్యకర్తలు బలవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై సీనియర్ నేత కరణం బలరాం, జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నోరు మెదపలేదు. కష్టపడినా పార్టీలో సరైన గుర్తింపు లేనప్పుడు తాజా ఎన్నికల్లో పనిచేయడం వృథా ప్రయాస అని నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇతర నియోజకవర్గాల నేతల్లో భయం..
ఒకవేళ సంతనూతలపాడుపై చంద్రబాబు తన నిర్ణయం మార్చుకుంటే, అనంతరం ఏ నియోజకవర్గానికి ఎసరు పెడతారనే భయం జిల్లా నేతల్లో మొదలైంది. ఉప ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోమారు టికెట్ ఆశిస్తుండగా, అక్కడ అతని ప్రాధాన్యతను తగ్గించే వ్యూహాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో దామచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కరణం బలరాంను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.
కనిగిరికి కదిరి బాబురావును ఖరారు చేశారో లేదోననే అయోమయంతో అక్క డ పార్టీ శ్రేణులు అనుమానంగానే పనిచేస్తున్నాయి.
గిద్దలూరుకు సాయికల్పనారెడ్డి పేరును కాదని, ఆమె కొడుకు అభిషేక్‌రెడ్డికి సీటు కేటాయింపుపై ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. దర్శిలో శిద్దా రాఘవరావుది అదే పరిస్థితి.
చీరాలలో పోతుల సునీతకు ప్రత్యామ్నాయంగా కాపు సామాజికవర్గ అభ్యర్థిని తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సంతనూతలపాడు బీజేపీకి వెళ్లడం వెనుక జిల్లా పార్టీలో ఉన్న కీలకనేతలు చక్రం తిప్పినట్లు కేడర్ ఆరోపిస్తుండగా, చంద్రబాబు నిర్ణయంలో మార్పువస్తే, కొండపి నియోజకవర్గాన్ని బీజేపీకి అప్పగిస్తారనే ఊహాగానాలూ లేకపోలేదు.
‘దేశం’లో రచ్చ..రచ్చ!
Published Tue, Apr 8 2014 2:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement