తెలుగుదేశం పార్టీలో నేతల ధిక్కార స్వరం క్రమంగా పెరుగుతోంది. రానున్న ఎన్ని కలకు అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు నేతలకు మింగుడు పడటం లేదు. సీనియర్లు, మాజీ మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఇతర పార్టీల నాయకులను టీడీపీలో చేర్చుకోవడాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. మరి కొందరైతే అధినేత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు. అభ్యర్థుల ఖరారు సమయంలో పార్టీకి అందించిన సేవలు, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. ఇందు కు భిన్నంగా జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అధినేతతో తాడోపేడో తేల్చుకునేందుకు రాజధానికి పయనమవుతున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ అధినేత నిర్ణయాలపై మీడియా ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో అధినేతకు కొన్ని సూచనలు చేశారు. ఇతర పార్టీల నాయకులను టీడీపీలో చేర్చుకునే ముందు దేశం నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం లేదంటూ పరోక్షంగా అధినేతకు చురకలంటించారు.
పార్టీ అధికారంలో లేకపోయినా 10 ఏళ్ళపాటు నాయకులు, కార్యకర్తలు ఎన్నో కష్టాలుపడి కాంగ్రెస్‌కు ఎదురొడ్డి పోరాడారని, మరెంతో మంది తమ ఆస్తులు, ప్రాణాలను ఫణంగా పెట్టారని గుర్తుచేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను గ్రేడింగ్, ఫిల్టర్ చేసి తీసుకోవాలని సూచించారు. చేర్పులు, మార్పులు అనేవి అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. పార్టీలో చేరే వారి చరిత్ర, అంకితభావం, విశ్వసనీయతను తెలుసుకుని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
మాజీమంత్రి, తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆలపాటి రాజా అధినేతపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకపోయినా, తనకు కాకుండా ఎవరికి సీటు కేటాయిస్తారనే ధోరణిలో ఉన్నారు. సినీనటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావుకు తెనాలి, ఆలపాటి రాజాకు గుంటూరు పశ్చిమ సీటును అధినేత కేటాయించే అవకాశాలున్నట్టు నేతలు చెబుతున్నారు. అయితే ఆలపాటి అభిమానులు తమ నాయకునికి కాకుండా తెనాలి సీటు మరొకరికి కేటాయిస్తే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.మంగళగిరి అసెంబ్లీ సీటును స్థానిక టీడీపీ నేతలకే కేటాయించాలని, బీసీ, ఓసీ ఎవరికి కేటాయించినా తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ రూరల్ అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ చెబుతున్నారు. అక్కడి పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన ముఖ్యనేతల సమావేశంలో స్థానిక వాదాన్ని లేవనెత్తారు. రెండున్నర దశాబ్దాలుగా నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసిన స్థానిన నాయకులు ఎందరో ఉన్నారని, వారిలో ఎవరికి ప్రాధాన్యం ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నిమ్మకాయల రాజనారాయణను పక్కన పెట్టి చలపతి విద్యాసంస్థల అధినేత మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులుకు సీటు ఇవ్వాలని కొందరు నాయకులు, అనుచరులు శుక్రవారం హైదరాబాద్ వెళ్ళారు. గెలుపు గుర్రాలకు టికెట్ కేటాయించాలని ఈ వర్గం కోరుతుంటే, పార్టీని పటిష్టం చేసిన నేతలను విస్మరించడం ఎంత వరకు సరైన చర్యని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే న్యాయవాది పోట్ల సుబ్బారావుకు టికెట్ కేటాయించాలంటూ స్థానిక నాయకులు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్ళారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీగా అధినేత బాబు ప్రకటనలకు భిన్నంగా ఈ ఎన్నికల్లో ఇప్పటి నుంచే పరిస్థితులు చోటుచేసుకోవడం అభిమానులకు నిరాశను కలిగిస్తుంది.