
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలతో అప్పటికప్పుడే పక్కా ఏర్పాట్లకు సీఎంఓ దిగింది. నిందితుడు శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధముందని, ఆతడు వైఎస్ జగన్ అభిమాని అని నమ్మించేలా గ్రాఫిక్స్‌తో కూడిన ఫ్లెక్సీ ఫొటోలను చంద్రబాబు కార్యాలయం రూపొందింప చేసి మంత్రుల ద్వారా, తన పచ్చ మీడియా ద్వారా ప్రచారానికి తెరలేపింది. చంద్రబాబు సూచనల మేరకు మంత్రులు నక్కా ఆనందబాబు కాలువ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి తదితరులు వరుసగా మీడియాతో మాట్లాడుతూ దాన్ని అమల్లో పెట్టారు.
ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఖండించడానికి బదులు దాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించడంపైనే వారి విమర్శలు సాగాయి. సినీనటుడు శివాజీ పేర్కొన్నట్లు ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇది జరిగిందని, కేంద్రం కావాలని ఇలా చేస్తూ రాష్ట్రాన్ని అస్థిర పరిచేందుకు ఇలా చేస్తోందని ఆరోపణలకు దిగారు. మంత్రు లు నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావులు నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని, అభిమానితోనే ఇలా చేయించుకున్నారంటూ ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్‌పైకి నెట్టే కుట్రకు తెరలేపారు. హేపీ న్యూ ఇయర్, పొంగల్ అంటూ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్లెక్సీ కూడా కట్టించారని ఫోన్లో జగన్, నిందితుడు శ్రీనివాసరావు కలసి ఉన్నట్లుగా ఫోన్లో ఉన్న ఫొటోను చూపించారు.
అయితే ఎప్పుడో పది నెలల క్రితంనాటి ఫ్లెక్సీ ఫొటో అంటూ మంత్రులు మీడియాకు విడుదల చేసిన ఫోన్లోని ఆ ఫొటో ఫ్లెక్సీకి సంబంధించినదిగా కాకుండా ఏదో గ్రాఫిక్స్‌తో రూపొందించినట్లుగా ఉండడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రాఫిక్స్ ఫ్లెక్సీ ఫొటోలో గరుడ పక్షి బొమ్మ ముద్రించి ఉండడం విశేషం. హేపీ న్యూ ఇయర్ ఫ్లెక్సీల్లో గరుడ బొమ్మ ముద్రించరని, ప్రభుత్వమే దీన్ని గ్రాఫిక్స్‌లో పెట్టించి విడుదల చేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోపక్క విశాఖపట్నంలో పోలీసు అధికారులు కూడా ఘటన జరిగిన కొద్ది సమయంలోనే ఇదే గ్రాఫిక్స్‌తో కూడిన ఫొటోను చూపి శ్రీనివాసరావు జగన్ అభిమాని అని ప్రకటన చేయడం కూడా అనుమానాలను మరింత పెంచింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు ఒక పథకం ప్రకారం నడిపిస్తున్నారన్న చర్చ ప్రజల్లో సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment