
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి మాజీ ఇన్‌చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్ వాపోయారు. 2014లో కిరణ్‌కుమార్ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని.. అందుకే పోటీచేశానన్నారు. అయితే ఎన్నికల తరువాత అన్నివిధాల ఆదుకొంటామని సీఎం రమేష్ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు.
నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్ కుమార్ రెడ్డికి ఇన్‌చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్ పదవిని కూడా ఇచ్చారన్నారు. సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే చంద్రబాబుకు ముస్లింల పట్ల ప్రేమ కనపడుతోందని విమర్శించారు. తన రాజీనామా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment