తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ఆట మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీటు ఎవరికి దక్కుతుందనే విషయమై విసృ్తత
‘గూడెం’ టీడీపీలో కుర్చీలాట
Published Mon, Jan 13 2014 4:24 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ఆట మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీటు ఎవరికి దక్కుతుందనే విషయమై విసృ్తత చర్చ సాగుతోంది. పాత కాపులకే మ్యాండెట్ ఇస్తారా.. లేక కొత్తవారికి, వలస వాదులకు రెడ్ కార్పెట్ పరుస్తారా అనేది తేలకపోవడంతో ఆ పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న వర్గ రాజకీయూలు రసకందాయంలో పడ్డాయి. టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు, మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి తనకు లేదా తన కుమారుడు నవీన్‌కు టికెట్ సాధించుకుంటారా అనే కోణంలో విశ్లేషణ చేస్తున్నారు. యర్రా చాణక్యం తెలిసిన వారు ఇలా జరగడానికి ఆస్కారం లేకపోలేదంటున్నారు. దీనికి ఊతమిచ్చే విధంగా ఆయన కుమారుడు నవీన్ తాడేపల్లిగూడెంలో మకాం పెట్టడం ఈ ఊహాగానాలకు అవకాశం కల్పిస్తోంది.
గతంలో యర్రా నారాయణస్వామి టికెట్ పొందిన ప్రతి సందర్భంలోనూ ఎన్నికలకు ముందు ఇక్కడ మకాం పెట్టేవారు. మొదటిసారి టికెట్ దక్కించుకున్న రోజుల్లో కొబ్బరి తోటలో నివాసం ఉన్నారు. రెండోసారి సత్యవతినగర్‌కు మకాం వచ్చారు. ఈసారి టికెట్ ఆశిస్తున్న నవీన్ తండ్రి బాటలోనే సత్యవతి నగర్ ప్రాంతంలో మకాం వేశారు. నారాయణస్వామి ఇప్పటికే తనను వెన్నంటి ఉన్న పార్టీ శ్రేణులను, తన అనుయాయులను పిలిపించుకుని మంత్రాంగం నడిపారు. ఎన్టీఆర్ హయూంలో ఓ వెలుగు వెలిగిన యర్రా నారాయణస్వామికి చంద్రబాబు హయూంలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అనంతర పరిణామాల నేపథ్యంలో సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే పనిలోపడిన చంద్రబాబు నాయుడు తాజాగా నారాయణస్వామికి పెద్దపీట వేయ డం ప్రారంభించారు.
ప్రస్తుతం అధినేతకు దగ్గరగా ఉంటున్న నారాయణస్వామి తాడేపల్లిగూడెం టికెట్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీలో చేరాలనుకుంటున్నవారి సమాచారాన్ని అధినేతకు సలహాల రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్టు సమాచారం. కీలెరిగి వాతపెట్టే నేర్పుగల నేతగా వినుతికెక్కిన నారాయణస్వామి టికెట్ విషయంలో అధినేతకు శిరోభారం తగ్గించే క్రమంలో చివరి అవకాశంగా ఈ సీటును తనకు ఇవ్వాలని కోరే అవకాశం లేకపోలేదు. పార్టీని వీడకుండా సుదీర్ఘకాలంపాటు చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని తన కుమారుడికైనా టికెట్ అడుగుతారని అంటున్నారు. ఇదే జరిగితే కుర్చీలాట రసవత్తరంగా మారడం ఖాయం. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు రెండోసారి టికెట్ దక్కించుకునే క్రమంలో ముందుకు సాగుతున్నారు. సామాజిక వర్గాల సర్ధుబాటు కోణంలో బాపిరాజుకు ఈసారి సీటు దక్కకపోవచ్చేనే ప్రచారం కూడా నడుస్తోంది.
ఈ కోణంలో బాపిరాజు మాటతీరు మారడం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి సేవచేసి గెలవగలిగిన వ్యక్తులను కాదని కొత్త వారికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, అధిష్టానంపై పోరు సల్పడానికి సిద్ధమని ఇటీవల గూడెంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రకటించారు. ఇదిలావుండగా, బీసీలకు లేదా పార్టీకి సేవచేసిన పాతకాపులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ఈ సమావేశంలో తెరపైకి తెచ్చారు. అలాంటివారిని ఆర్థికపరంగా ఆదకునేందుకు అవసరమైతే ఆస్తులను కుదువపెడతామని, చందాలు వేసుకుని అయినా గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా, వేరే పార్టీల నుంచి వచ్చేవారికి సీటిస్తే సహించేది లేదనే హెచ్చరికలు ఇప్పటికే అధిష్టానానికి వెళ్లారుు.
అరుునా, వేరే పార్టీనుంచి టీడీపీలోకి వచ్చే వారిలో ఎవరో ఒకరికి గూడెం సీటును కట్టబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇదిలావుంటే బీసీలకు జిల్లాలో నాలుగు టీడీపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఊపందుకుంది. ఆ జాబితాలో తాడేపల్లిగూడెంను కూడా చేర్చారు. ఇటీవల బీసీ నాయకులు చంద్రబాబును కలసి ఈ విషయాన్ని నివేదించారు కూడా. బీసీ కోటాలో కిల్లాడి ప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చంద్రబాబుకు లేఖ సైతం ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కిల్లాడికి అధినేతకు దగ్గరగా ఉండే యనమల రామకృష్ణునితో సాన్నిహిత్యం ఉంది. ఆయనకు టీడీపీ బెర్తు దక్కే అవకాశాలను పార్టీ వర్గాలు కొట్టి పారేయడం లేదు. ఏదేమైనా.. సీటు ఎవరికి ఇచ్చినా టీడీపీలో వర్గపోరు తప్పదనే విషయాన్ని విశ్లేషకులు నొక్కిచెబుతున్నారు.
Advertisement
Advertisement