సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. ఏ పనైనా కలిసికట్టుగా చేయాలన్న ఓ కట్టుబాటు ఉంటుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేనల మధ్య ఇదే కొరవడింది. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాట్లు దీనికో తాజా ఉదాహరణ. ఈ నెల 28న టీడీపీ, జనసేన సంయుక్తంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా ఏర్పాట్ల పరిశీలనకు రెండు పార్టీల నాయకులతో కమిటీలు వేస్తామని ప్రకటించారు.
కానీ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలు 100 మందితో సభ జరిగే ప్రత్తిపాడు ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించి వెళ్లిపోయారు. అంతకు ముందు గురువారం సాయంత్రమే టీడీపీ నాయకులు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పరిశీలన సమయంలో వీరు వారిని, వారు వీరిని పిలవలేదు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం పరిశీలించారని తెలియగానే ఆ సాయంత్రమే టీడీపీ జోన్–2 కోఆర్డినేటర్ నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో హడావుడిగా సమావేశం పెట్టారు.
మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి, కొందరు మాజీ ఎమ్మెల్యేలు హడావుడిగా ఏర్పాట్లు పరిశీలించి అంతా టీడీపీయే చేస్తోందని, జనసేనది ఏమీ లేదన్నట్టు వ్యవహరించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని తానే మాట్లాడి సెట్ చేశానని, అంతా తామే చేస్తున్నామని జనసేన ఇన్‌చార్జి మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు. ఇలా ఎవరికి వారుగా పనిచేస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
కొనసాగుతున్న మాటల యుద్ధం
తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వలవల బాబ్జి, జనసేన ఇన్‌చార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ బరిలో ఉన్నారు. ఇద్దరూ టికెట్ మాదంటే మాదంటూ వారి స్థాయికి మించి భారీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. జనసేన మొదట ప్రకటించే సీటు తాడేపల్లిగూడెమేనని బొలిశెట్టి శ్రీనివాస్, 20 ఏళ్ల తరువాత టీడీపీ గెలిచే సీటు తాడేపల్లిగూడేమని వలవల బాబ్జీ ప్రకటించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది.
ఒకరి సమావేశాలకు మరొకరు వెళ్లకుండా అదే రోజు కౌంటర్ ప్రోగ్రామ్‌లు నిర్వహించే స్థాయికి ఇది చేరింది. పార్టీలు రెండు దారుల్లో వెళ్తున్న ప్రాంతంలో సభ నిర్వహించనుండటంతో కొత్త చిచ్చు మొదలైందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన తొలి జాబితాలో మొదటి సీటు తాడేపల్లిగూడెం ఉంటుందని నానా హడావుడి చేశారు. తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ, బహిరంగ సభ నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్‌ను పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment