మహా రుద్రాభిషేకం ప్రచార బ్యానర్
నరసరావుపేట ఈస్ట్ (గుంటూరు): లోక కల్యాణార్థం తలపెట్టిన మహా రుద్రాభిషేకానికీ టీడీపీ నాయకుల గ్రహణం తప్పలేదు. ప్రతి పనికి ‘కే ట్యాక్స్’ వసూలు చేస్తున్న నేతలు దేవుడినీ వదిలి పెట్టలేదు. కాసులిస్తేనే రుద్రాభిషేకానికి అనుమతి అంటూ మోకాలడ్డటంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మహా రుద్రాభిషేకం వాయిదా పడింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియంలో శివభక్తుల ఆధ్వర్యంలో ఆదివారం మహా రుద్రాభిషేకం తలపెట్టారు. మహా శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేసుకునేలా రుద్రాభిషేకం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఇందుకోసం రెండు నెలల నుంచి నరసరావుపేట పట్టణం, పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉన్నట్టుండి రుద్రాభిషేకాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. కాగా.. రుద్రాభిషేకం నిర్వహించేందుకు సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియం సరైందని నిర్ణయించి, సంబంధిత కమిటీ ప్రతినిధులతో అప్పట్లోనే ఒప్పందం చేసుకున్నారు.
ఇందుకు కొంత రుసుం కూడా చెల్లించారు. నెలన్నర తరువాత స్టేడియం కమిటీలో కీలక వ్యక్తి రంగంలోకి దిగి ముందుగా అనుకున్న రుసుం కంటే అదనంగా చెల్లిస్తేనే కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని చెప్పటంతో నిర్వాహకులు కంగుతిన్నారు. కార్యక్రమం జరిగే ఆదివారంతో పాటు ముందు రెండు రోజులు, తర్వాత రెండు రోజులు స్టేడియంకు ఫీజు చెల్లించాలని చెప్పటంతో అందుకు కూడా నిర్వాహకులు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఆ మొత్తంతోపాటు మరికొంత ముట్టజెప్పనిదే కార్యక్రమం జరగనిచ్చేది లేదని కీలక వ్యక్తి అడ్డం తిరగటంతో నిర్వాహకులలో ఆందోళన మొదలైంది.
సదరు వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్న కీలక నేతకు అనుంగు శిష్యుడు కావటంతో మిగిలిన నాయకులు సైతం నోరు మెదపటం లేదు. కాగా, రుద్రాభిషేకం నిర్వాహకుడు టీడీపీ నేత వేధింపులు భరించలేక అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించేందుకు విరాళాలు ఇచ్చిన దాతలు మధ్యవర్తిత్వం నెరిపేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు తెలుస్తోంది. మహా రుద్రాభిషేకాన్ని తిరిగి ఎప్పుడు జరిపేది త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment