'కౌరవులతో సమానంగా టీడీపీ సభ్యులు' | tdp members are equal in number and nature to kauravas, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

'కౌరవులతో సమానంగా టీడీపీ సభ్యులు'

Published Sat, Sep 6 2014 3:39 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

'కౌరవులతో సమానంగా టీడీపీ సభ్యులు' - Sakshi

'కౌరవులతో సమానంగా టీడీపీ సభ్యులు'

అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని, టీడీపీ సభ్యులు కూడా సరిగ్గా కౌరవులతో సరిపోయేలా 101 మంది ఉన్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

''ఈరోజు కూడా ఇలాంటి అన్యాయమే జరుగుతోంది. అసెంబ్లీలో ప్రజలకు న్యాయం జరగడంలేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసే పరిస్థితి అసెంబ్లీలో ఉండట్లేదు. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి, ప్రజలకు జరగబోయే మేలును కూడా చెప్పాలి. బడ్జెట్ మీద ద్రవ్య వినిమయ బిల్లుపై చివరి రోజు చర్చ జరగాలి. దానికి ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చి, వివరణలు ఇవ్వాలి. దాంతో సభ ముగియాలి. చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా, చేనేత రుణాలను పక్కన పెట్టేశారని, నిరుద్యోగ భృతిని వదిలేశారని... ఇవన్నీ మరోసారి బయటకు వస్తాయని, ఆ విషయం బయటకు రాకూడదనే.. హఠాత్తుగా బీసీలపై ప్రేమ ఉన్నట్లుగా ఆ తీర్మానం తీసుకొచ్చారు. వాళ్లపై నిజంగానే ప్రేమ ఉంటే ముందే ఎందుకు ఆ తీర్మానం పెట్టలేదు? అసలు కారణం.. బీసీలపై ప్రేమ కాదు. రుణమాఫీ ఎగవేసిన విషయం వెలుగులోకి రాకూడదనే పెట్టారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. తీర్మానానికి, ప్రకటనకు తేడా తెలియడంలేదు. అవతలివాళ్లకు ఏమీ తెలియదు, అనుభవం లేదంటూ బురద చల్లే కార్యక్రమం నడిపిస్తున్నారు. తన వీపు తనకు కనడపటంలేదు. 1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు ఏం తెలుసు? ఆయనను ఇప్పుడు గొప్ప నాయకుడంటున్నారు.

సాధారణంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే కనీసం పది రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. దాంతోపాటే తీర్మానం కాపీ ఇవ్వాలి. కానీ స్పీకర్ తమ మనిషే అన్నట్లుగా ఆయనతో బుల్డోజ్ చేయించారు. ఒకవేళ స్పీకర్ కావాలనుకుంటే మాత్రం పదిరోజుల కంటే తక్కువ నోటీసుతో కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు. కానీ తక్కువ అంటే.. పొద్దున్న నోటీసిచ్చి వెంటనే చర్చ అనడం సరికాదు. 11 గంటల దాకా దాని గురించి ఎవరికీ తెలియదంటే సభ తీరేంటి? బీసీల సమస్యల మీద వాళ్లు మాత్రమే నాలుగు మాటలు మాట్లాడి సరిపెట్టేయడమేనా? నేను ప్రతిపక్ష నేతగా అక్కడే గంటన్నర పాటు ఉన్నాను. చంద్రబాబు ఒక్కరే 45 నిమిషాలు మాట్లాడారు. తర్వాత తన పార్టీకి చెందిన ముగ్గురితో తిట్టించారు. మా పార్టీ నుంచి ఇద్దరితో మాత్రమే మాట్లాడించారు. నేను చేతులెత్తి అవకాశం అడిగినా  ఇవ్వలేదు. మైకు ముందున్న బటన్ ఎన్నిసార్లు నొక్కినా చూడరు. కావాలనే వదిలేసి.. 'మోషన్ పాస్డ్' అనేస్తారు. ప్రతిపక్ష నాయకుడు బీసీ సంక్షేమంపై మాట్లాతానన్నా వినరు. ప్రతిపక్షం ఏం చెప్పాలనుకున్నా చెప్పించే పరిస్థితి లేదు. కౌరవ సభను ఈ అసెంబ్లీ మరిపించింది. నెంబర్ కూడా సరిగ్గా కౌరవులతో సమానంగా 101 మంది. వీళ్లు మనుషులా.. రాక్షసులా అనిపిస్తుంది.

బీసీలకు 33.33 శాతం సీట్లు కేటాయించాలని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. కేంద్రంలో కూడా బీసీ సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక శాఖ ఏర్పాటుచేయాలని, బడ్జెట్లో 25 శాతం వాళ్లకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఇదే చట్టసభలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2008లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ విషయాలు వీళ్లు ఎప్పుడూ చెప్పరు. ఈరోజు కూడా బీసీలపై వీళ్ల ప్రేమ ఎలాంటిదంటే.. ఇదే చంద్రబాబు హయాంలో బీసీలకు సంబంధించి, వైఎస్ఆర్ హయాంలో బీసీలకు ఎలాంటి మేలు కలిగిందో చూద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం గురించి గతంలో ఎవరూ కనీసం ఆలోచించలేదు కూడా. ఫీజులు కట్టలేక చాలామంది ఇంతకుముందు తమ పిల్లలను చదివించేవారు కారు. అలాంటి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చినది రాజశేఖరరెడ్డే. దాదాపు సగం మంది లబ్ధిదారులు బీసీలే. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. 1984 నుంచి 2004 వరకు 20 ఏళ్లలో కలిపి 27.50 లక్షల ఇళ్లు కట్టించారు. వాటిలో బీసీలకు కేవలం 6.32 లక్షల ఇళ్లే వచ్చాయి. అంటే 23 శాతం. వైఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే.. ఇక్కడే 47 లక్షల ఇళ్లు కట్టించారు. అందులో 19.88 లక్షల ఇళ్లు.. అంటే 41 శాతం ఇళ్లు బీసీలకే చెందాయి.

గొర్రెలకు బీమా లాంటి పథకం తెచ్చింది కూడా ఒక్క రాజశేఖరరెడ్డే తప్ప చంద్రబాబు కాదు. అట్టడుగు స్థాయిలో ఉన్న బీసీలకు మేలు జరగాలని ఎన్టీఆర్ 2 రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చారు. అప్పట్లో సబ్సిడీ 63 పైసలు. రాజశేఖరరెడ్డి కేజీ 28 రూపాయలు ఉన్న సమయంలో కూడా పేదలకు 2 రూపాయలకే ఇచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులలో పేదలు ఎవరైనా గర్వంగా వైద్యం చేయించుకున్నారంటే.. అది రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ఆరోగ్యశ్రీ వల్లనే. పింఛన్లను కూడా 200కు పెంచి 78 లక్షల మందికి అందించారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా 100 సీట్లు బీసీలకు ఇస్తామంటారు. ప్రతి ఎన్నికల్లో అదే చేస్తారు. కానీ ఒక్క ఎన్నికలోనూ వంద సీట్లు ఇచ్చిన పాపాన పోలేదు. 2008లో వరంగల్లో బీసీ గర్జన జరిగితే.. అక్కడ 100 సీట్లు ఇస్తామని టీడీపీ ప్రకటన చేసింది. 2009 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన చేతివృత్తుల సదస్సులో కూడా బీసీల మంత్రాన్ని మరోసారి పఠించారు. తీరా అప్పుడు ఆ ఎన్నికల్లో కేవలం 44 సీట్లే బీసీలకు ఇచ్చారు. మిత్రపక్షాలతో కలుపుకొన్నా కూడా 66 సీట్లు ఇచ్చారు. అదే ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి 73 సీట్లు బీసీలకు ఇచ్చారు. 2004లో బీసీలకు చంద్రబాబు 59 సీట్లే ఇచ్చారు. కానీ ఎన్నికల్లో మాత్రం వందసీట్ల మంత్రం చెబుతారు, తానే బీసీలకు పేటెంట్ అంటారు.

ఎవరైనా బీసీలను దగ్గరకు చేర్చుకోవాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కరూ చూడాలి. మొన్న ఎన్నికల్లో మేం 54 సీట్లిస్తే.. చంద్రబాబు 58 సీట్లు ఇచ్చారు. మేం ముందుగా జాబితా ఇవ్వడంతో నాలుగు ఎక్కువ చేసి ఇచ్చారంతే. రైతు రుణమాఫీ చేయలేదన్న విషయం బయట పడుతుందని, దాన్ని కప్పిపుచ్చుకోడానికి మరో టాపిక్ తీసుకున్నారు. ఇదే అసెంబ్లీ సమావేశంలో.. మీరంతా కొత్తవాళ్లు, నిక్కర్లు వేసుకున్నాళ్లు, ఏమీ తెలియదు అంటారు. నిజమే.. నిక్కర్లు వేసుకున్న వాళ్లమే. కానీ ఈ తరం వాళ్లం. చదువుకుని అసెంబ్లీకి వస్తాం. వాళ్లలా మోసం చేయం, అబద్ధాలు చెప్పం.

బడ్జెట్ పుస్తకాన్ని ఈరోజే మాముందు పెట్టారు. రెండుమూడు కాలమ్లు తప్ప, మిగిలినవన్నీ మళ్లీ కట్ అండ్ పేస్టే. ప్రొవిజినల్ స్టేట్మెంట్లు వచ్చి ఉండాలి. ఈ సంవత్సరం నాలుగు నెలలు అయిపోయిన తర్వాత సవరించిన అంచనాలలో కూడా అన్నీ తప్పులు తడకలే. రెవెన్యూ వసూళ్లు బడ్జెట్లో 1,27,772 కోట్లు అయితే సవరించిన అంచనాల్లో కూడా అదే సంఖ్య ఉంది. రెవెన్యూ వ్యయం కూడా అంతే. ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కాదు. రెవెన్యూ లోటు 6వేల కోట్లా.. 25 వేల కోట్లా అన్నది కూడా తెలియదు. వీటిలో తప్పులు జరిగితే నష్టపోయేది పేదవాళ్లు. 2013-14 సవరించిన అంచనాల్లో ప్రణాళికేతర వ్యయం 93,299 కోట్లు. ఇది ప్రతియేటా దాదాపు 15 శాతం పెరుగుతుంది. సీమాంధ్రకు ప్రణాళికేతర వ్యయం 62,523 కోట్లుగా నమోదు కావాల్సింది.. కానీ ఏకంగా
85,101 కోట్లు చూపించారు. జీతాలు, పింఛన్లకు వెచ్చించే వ్యయం ఇంత మొత్తం పెంచడం దారుణం.''

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement