సాక్షి, ఒంగోలు అర్బన్: ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ చిల్లర రాజకీయానికి తెరలేపింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే పింఛన్ పంపిణీ కేంద్రాలను ఎన్నికల ప్రచార కేంద్రాలుగా మార్చుకునేందుకు టీడీపీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి వారం పదిరోజుల పాటు జరిగే పింఛన్ పంపిణీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారు. పింఛన్ పాస్ పుస్తకాలపై చంద్రబాబు ఫొటో ఉంటుంది. గతంలో వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చిన చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పెంచుతామని ప్రకటించారు. చంద్రబాబు హడావుడిగా పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాడు. చంద్రబాబును ప్రజలు నమ్మలేదు. నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో వృద్ధులు, వికలాంగులు, మహిళలు గుర్తుకొచ్చారా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత పోవడంతో ఓటమి భయం పట్టుకుంది. డిపాజిట్లయినా దక్కించుకునేందుకు సీఎం చంద్రబాబు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. వాటిలో పింఛన్ కేంద్రాలను ప్రచార కేంద్రాలుగా మార్చుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.
పింఛన్ పంపిణీ కేంద్రాలపై దృష్టి
పింఛన్ పంపిణీ కేంద్రాలను తమకు అనుకూలంగా మార్చుకుని వృద్ధులు, వికలాంగులతో ఓట్లు వేయించుకునేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పథక రచన చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ చోటామోటా నాయకులు, కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల నిఘా బృందాలు పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద నిఘా ఉంచాలని కోరుతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు బందోబస్తుతో పాటు నిఘా బృందాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల వద్ద ఎన్నికల ప్రచారం లేకుండా చూడాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment