
కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి పేరా రామసుబ్బారెడ్డి, ఆయన సోదరుడు వెంకటసుబ్బారెడ్డితో పాటు వారి కుమారులు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, నారాయణరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రసాదరెడ్డిలు శనివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. డాక్టర్ రామిరెడ్డి 30 ఏళ్లుగా టీడీపీకి సేవలందించారు. అయితే ఆయన సేవలను ఆ పార్టీ గుర్తించకపోగా అడుగడుగునా అవమానాలకు గురిచేయడంతో ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం కోవెలకుంట్లకు రావడంతో పేరా సోదరులు, రామిరెడ్డితో పాటు, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్, గిరిజన యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసనాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కుమారి, రామిరెడ్డి ముఖ్య అనుచరులు నాగభూషణంరెడ్డి, నాగేష్ తదితరులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్థన్‌రెడ్డి తదితరులున్నారు.