కళ్లకు గంతలు కట్టి..
పాత పథకాలను తవ్వితీస్తున్న టీడీపీ ప్రభుత్వం
నీటి నిల్వకు 4500 పనులకు ప్రణాళికలు
{Xన్‌కవర్ పేరిట పండ్ల తోటల పెంపకం
కార్యకర్తల కోసమే మార్పులంటూ విమర్శలు
కొత్త ప్రభుత్వం పాత పథకాలకు ఊపిరిలూదుతోంది. తన పాలనలో తవ్విన పచ్చ గుంతలకు చంద్రబాబు మళ్లీ ప్రాణం పోయబోతున్నారు. దీని కోసం వేల సంఖ్యలో పనులు చేపట్టి తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికల సిద్ధం చేయిస్తున్నారు. ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారు.
నూతన ప్రభుత్వం కొలువు తీరడంతోనే తన మార్కు పథకాలను తెరమీదకు తెస్తోంది. గతంలో ప్రాధాన్యం ఇచ్చిన ‘ఇంకుడుగుంతలు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ తెర పైకి తెచ్చింది. దీనికి సంబంధించిన ప్రణాళికను సత్వరం తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు జిల్లాలోని ఆరు క్లస్టర్లలో నీటిని నిల్వ చేసే పనులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట ఇలా ఆరు క్లస్టర్లలో నీటి నిల్వ చేసే కార్యక్రమంలో భాగంగా 4,500 పనులను చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇందులో రూ.50 వేల మొదలు రూ.5 లక్షల లోపు పనులు ఉన్నట్లు సమాచారం.
గ్రీన్ కవర్ పేరుతో....
పండ్ల తోటల పెంపకం పేరు కాస్తా మార్చి గ్రీన్ కవర్ పేరిట మొక్కల పెంపకం చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కొత్త ప్రభుత్వం రెండవ ప్రాధాన్యం ఇచ్చింది.దీనికి సంబంధించి అధికారులు ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వెయ్యి ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టనున్నారు.24 మండలాలు, 106 గ్రామ పంచాయతీల్లో రైతులకు లబ్ధి కలగనుంది. పొలాల గట్ల వెంట 8 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. 3.72 లక్షల విస్తీర్ణం కవర్ కానుంది.మూడవ ప్రాధాన్యం కింద వ్యక్తిగతంగా లబ్ధి కలిగే పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ ఏడాది నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద 30 వేల వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించనున్నారు.కొత్త ప్రభుత్వం తన మార్కు ఉండేలా పథకంలో మార్పులు తెస్తుండటంతో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై వీటి ప్రభావం పడుతుందేమోననే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది.దీనికి తోడు టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే పథకంలో మార్పులు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంచనాలు రూపొందించాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరానికి పనులకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేశాం. నీటిని నిల్వ చేసే పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. రెండో ప్రాధాన్యం కింద గ్రీన్‌కవర్ పేరుతో పచ్చదనాన్ని పెంపొందించే పనులు చేపట్టనున్నాం. వ్యక్తిగత పనులకు మూడో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ పనులన్నీటి కీ అంచనాలు రూపొందించాం.
- ఢిల్లీరావు, డ్వామా పీడీ