మందులు ఇచ్చి అబార్షన్ చేయించిన వైనం
పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరిన విద్యార్థిని
చిలుకూరు, న్యూస్‌లైన్: ఆటల పేరుతో ఆ అమ్మాయిపై కన్నేశాడు. వివిధ పోటీలకు ఎంపికైందంటూ తోటి ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులను నమ్మించాడు. తరచు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. చివరకు గర్భవతిని చేసి, అబార్షన్ మాత్రలు మింగించాడు. దీంతో ఆమె పరిస్థితి విషమించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం రామాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో వెలుగుచూసింది.
రామాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థినికి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉంది. పాఠశాలలో ఆటలాడించే ఓ ఉపాధ్యాయుడు ఆటల పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. మండల, డివిజన్ జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైందంటూ ఆమెను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అదే అదనుగా ఆమెను గర్భవతిని చేశాడు. పాఠశాలకు వస్తున్న ఆ విద్యార్థిని శరీరంలో మార్పులు రావడంతో తోటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఇదే క్రమంలో ఆమె 10 రోజుల నుంచి బడికి రావడం మానేసింది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆ ఉపాధ్యాయుడు ఆమెకు ఆరు నెలల గర్భం అని తెలుసుకని, అబార్షన్ అయ్యేందుకు మందులు వేయించాడు. కొద్దిసేపటికే అబార్షన్ కాగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన విద్యార్థిని బంధువులు సోమవారం పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు.
విద్యార్థినిని గర్భవతిని చేసిన కీచక గురువు
Published Mon, Nov 4 2013 11:21 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
Advertisement