హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో దిగేందుకు అధికారులు అనుమతించ లేదు. దాంతో విమానం దాదాపు 45 నిముషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం ఎయిర్పోర్ట్ అధికారులు విమానం ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు.
దాంతో స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ విమానంలో దాదాపు102 మంది ప్రయాణీకులు న్యూఢిల్లీ బయలుదేరారు. అయితే వారిని మరో విమానంలో న్యూఢిల్లీ పంపేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్పైస్ జెట్ విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు సాంకేతిక నిపుణులు సత్వర చర్యలు చేపట్టారు.