యూటీ అనేవారి నాలుకలు చీరేస్తారు: హరీష్‌రావు | Telangana People not Agree to Union territory: TRS MLA T. Harish Rao | Sakshi
Sakshi News home page

యూటీ అనేవారి నాలుకలు చీరేస్తారు: హరీష్‌రావు

Published Sat, Aug 24 2013 8:51 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

యూటీ అనేవారి నాలుకలు చీరేస్తారు: హరీష్‌రావు - Sakshi

యూటీ అనేవారి నాలుకలు చీరేస్తారు: హరీష్‌రావు

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లేదా నగరంపై ప్రత్యేక హక్కులు కావాలనే వారి నాలుకలను తెలంగాణవాదులు చీరేస్తారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హెచ్చరించారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లేదా నగరంపై ప్రత్యేక హక్కులు కావాలనే వారి నాలుకలను తెలంగాణవాదులు చీరేస్తారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హెచ్చరించారు. ఇలాంటి డిమాండ్లు చేసేవారిలో కాంగ్రెస్ నేత చిరంజీవితో సహా ఎవరున్నా ఆ హెచ్చరిక అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి సమైక్యాంధ్ర పోరాట ంలో పాల్గొన్న వారికి పూలదండలు వేసి గౌరవిస్తున్న తీరుపై డీజీపీ జవాబివ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతిదీక్షలో భాగంగా శనివారం గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది చేపట్టిన దీక్షను ప్రారంభించిన అనంతరం హరీష్‌రావు ప్రసంగించారు. చిరంజీవి హైదరాబాద్‌లో ఉండాలనుకున్నా, ఆయనకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉన్నా అందుకోసం ప్రయత్నించుకోవాలే తప్ప నగరంపై వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. హైదరాబాద్‌పై తెలంగాణవాదులకే హక్కులుంటాయని ఇందుకు వ్యతిరేక అభిప్రాయాలు, నిర్ణయాలు వచ్చినా ఇన్నాళ్లు ఓపికతో ఉన్న తెలంగాణవాదుల విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుందని అన్నారు.

తెలంగాణ ఏర్పాటు వెనక్కుపోతుందంటున్న నేతలు వారి పార్టీల వైఖరిని స్పష్టంచేయాలని కోరారు. సొంత తమ్ముడితో సఖ్యంగా ఉండలేని నందమూరి హరికృష్ణకు ప్రాంతాలు విడిపోవద్దని కోరే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన హరికృష్ణ ఆయన తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన 610జీవో అమలుకోసం ఎందుకు పోరాడ  లేదని నిలదీశారు. చంద్రబాబు తెలంగాణకు కట్టుబడింది వాస్తవం అయితే వెంటనే హరికృష్ణను పార్టీలోనుంచి సస్పెండ్ చేయాలని కోరారు.

జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేయడం వల్లే హైదరాబాద్ నగరం ప్రస్తుత స్థాయిలో అభివృద్ధి చెందిందని అన్నారు.  పారిశ్రామిక విస్తరణ కోసం 20 ఏళ్లలో తీవ్ర విధ్వంసం జరిగిందని ఆరోపించారు. ఐటీ, రియల్ ఎస్టేట్ వంటి వి అభివృద్ధి చెంది హెరిటేజ్ వంటి సంస్థలు పుట్టుకొచ్చి చేతి, కులవృత్తులను నాశనం చేశాయని అన్నారు. విభజనకు సహకరిస్తే రెండు చోట్లా వికాసం సాధ్యమని చెప్పారు. విద్య విషయంలో సీమాంధ్రులు వెనక బడి పోతారని కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజాం కాలంలో నగరం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు.

టీఆర్‌ఎస్ అగ్రనేత కె.కేశవరావు ప్రసంగిస్తూ... తెలంగాణను అడ్డుకునేందుకు సినీ మాఫియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 1.85లక్షల ఎకరాల వ్యవసాయ భూమి సీమాంధ్రుల చేతుల్లో ఉందన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణవారు పాన్‌షాపులు,తోపుడు బండ్లతో జీవనం సాగిస్తుంటే సీమాంధ్రులు షాపింగ్‌మాల్స్, మల్టిఫెక్స్‌ల స్థాయికి ఎదిగారని దుయ్యబట్టారు. రెండు లక్షలమంది ఉద్యోగులను తొలగించడం, తెలంగాణలోని 23 ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను మూసివేయించారని ఆరోపించారు. అన్నిపార్టీల అభిప్రాయాలు తీసుకున తర్వాతే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతి గురించి తెలియని వారే కేంద్ర పాలిత ప్రాంతం అనే డిమాండ్లు చేస్తారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌పై న్యాయబద్ధంగా కోరే హక్కులను వేటినైనా తెలంగాణవాదులు అభ్యంతరం చెప్పరని తెలిపారు.

సీమాంధ్ర నేతలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడవద్దని కోరారు. ప్రజాగాయని విమలక్క మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దోపిడిదారులు ఉంటారని, వారిపై పోరాటం చేయక తప్పదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిమాణంపై దృష్టిసారించాలని కోరారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి.అరవిందరెడి ్డ, జేఏసీ నేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, దేవి ప్రసాద్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement