పదో తరగతి పాస్ లేదా ఫెయిలై డ్రాపౌట్స్‌గా మారిన విద్యార్థులను గుర్తించి వారికి స్వయం ఉపాధిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఎంఈఎస్...
- జిల్లాలో నాలుగు కళాశాలల ఎంపిక
- డ్రాపౌట్లను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే
పలమనేరు, న్యూస్‌లైన్: పదో తరగతి పాస్ లేదా ఫెయిలై డ్రాపౌట్స్‌గా మారిన విద్యార్థులను గుర్తించి వారికి స్వయం ఉపాధిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఎంఈఎస్ (మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్స్) కార్యక్రమానికి జిల్లా వృత్తి విద్యాశాఖ నడుం బిగించింది. ఆ మేరకు జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, చిత్తూరు, కుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఈ ప్రత్యేక శిక్షణకు పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ కళాశాలల వద్ద శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను డీవీఈవో సుజనమల్లిక పర్యవేక్షించారు.
సంబంధిత మండలాల్లో పదో తరగతి విద్యార్థుల వివరాల సేకరణ పూర్తయింది. వీరందరూ ఉన్నత చదువులకు వెళ్లారా లేక చదువు మానేశారా అనే విషయమై సర్వే నిర్వహించా రు. సుమారు 30 శాతం మంది విద్యార్థులు ఖాళీగానే ఉన్నట్టు తేలింది. వీరికి పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలనే తలంపుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంపికైన మండలాల్లో ఎంఈవో, కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులతో మండల లెవల్ కమిటీని ఏర్పాటు చేశారు.
వీరు డ్రాపౌట్స్ వివరాల ప్రకారం వారి ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి శిక్షణ కేంద్రాలకు విద్యార్థులు వచ్చేలా చొరవ తీసుకుంటారు. అనంతరం విద్యార్థులకు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తారు. ప్రస్తుతం ఎనిమిది నుంచి పదో తరగతి చదువుతూ ఆసక్తి ఉన్న విద్యార్థులకు సైతం ఇదే కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.