
ఒక అభ్యర్ధి టెట్ పేపర్–3 జవాబు పత్రం, అభ్యంతరాల తరువాత దానికి సంబంధంలేని (వెబ్‌సైట్ ద్వారా వచ్చిన)జవాబు పత్రం
విజయనగరం అర్బన్:ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహిస్తున్న పరీక్ష(టెట్)లో మొదటినుంచీ గందరగోళం చోటు చేసుకుంటోంది. నిర్వాహకుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికే ప్రకటించిన మార్కులు తారుమారయిన విషయంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు వాటి సవరణ ప్రక్రియలోనూ తిప్పలు తప్పడం లేదు. జవాబులు, మార్కులు చూసుకొని తప్పులుంటే అభ్యర్థులు సవరణకు విన్నవించుకోవడానికి వీలుగా టెట్ నిర్వాహకులు వెబ్ సైట్‌ను రూపొందించి ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు ఫిర్యాదు ఇచ్పుకోవాలని షెడ్యూల్ ప్రకటించారు. ప్రకటించి నాలుగు రోజులవుతున్నా సంబంధిత వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టెట్ హెల్ప్‌లైన్(ఫోన్ నంబర్: 9121148061) కేంద్రం నుంచి సందేహాలను తీర్చడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌కి సంబంధించిన పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరై తమ ప్రతిభను ప్రదర్శించుకున్నారు.
పనిచేయని వెబ్‌సైట్...
నెల్లిమర్లకు చెందిన పేపర్–3 హిందీ సబ్జెక్ట్ అభ్యర్ధి పి.సునీత ప్రాధమిక ‘కీ’ అభ్యంతరాలపై విడుదల చేసిన ‘కీ’ అనుసరించి 100 మార్కులకు పైగా రావాల్సి ఉన్నా ఆమె క్వాలిఫై కానట్టు తేల్చారు. దీనిపై ఆమె టెట్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయగా వారు పంపించిన మార్కులుగాని, జవాబు పత్రంగానీ తనకు సంబంధించినది కాకుండా వేరేది ఇచ్చారు. ఈ సమస్యను తిరిగి చెప్పుకోవడానికి నిర్వాహక వ్యవస్థ అందుబాటులో లేదు. ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నవారు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఈ విషయంలో టెట్ నిర్వాహక హెల్ప్‌లైన్ సెంటర్‌కు తెలియజేసినప్పటికీ వారి నుంచి స్పందన లభించలేదని వాపోతున్నారు. రెండురోజులుగా ప్రయత్నిస్తే ఎట్టకేలకు కొందరికి అదృష్ట వశాత్తూ ఫోన్ పలికినా అటునుంచి అసహన సమాధానం వచ్చిందని చెబుతున్నారు. ఫిర్యాదుల సవరణకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో సమస్య ఎలా పరిష్కారం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తప్పులు దిద్దలేనపుడు టెట్ మరలా జరపాలి
పేపర్–3 హిందీ సబ్జెక్ట్ టెట్ రాశాను. ప్రాధమిక ‘కీ’కి వెబ్‌సైట్‌లో పెట్టిన నా జవాబు పత్రానికి సంబంధం లేదు. ఈ తప్పిదాన్ని సవరించాలని కోరుతూ నిబంధనల మేరకు రూ.200లు ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించాను. ఈ నెల 31లోపు గడువుగా ప్రకటించారు. ఇంత వరకు సంబంధిత వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదు. హెల్ప్‌లైన్ సెంటర్‌లో టెట్ నిర్వాహకుల సమాధానాలు నిర్లక్ష్యంగా వస్తున్నాయి. అభ్యర్థుల సందేహాలు తీర్చలేకపోతే టెట్‌ని మరలా జరిపి న్యాయం చేయాలి. – పి.సునీత, టెట్ అభ్యర్థిని, నెల్లిమర్ల
Comments
Please login to add a commentAdd a comment