అసలుకే ఎసరు! | The amount of interest credited to the savings dvakra | Sakshi
Sakshi News home page

అసలుకే ఎసరు!

Published Tue, Jun 24 2014 1:33 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

అసలుకే ఎసరు! - Sakshi

అసలుకే ఎసరు!

  • డ్వాక్రాలో పొదుపు సొమ్ము వడ్డీలకే జమ
  •  బంగారం వేలం వేస్తామని కృత్తివెన్ను ఇండియన్ బ్యాంకు నోటీసు
  •  నీటి మీద రాతలుగా మారుతున్న చంద్రబాబు హామీలు
  • డ్వాక్రా రుణమాఫీని నమ్ముకుంటే మహిళలకు బ్యాంకు ఖాతాల్లో పొదుపు మొత్తం గల్లంతయ్యే విధంగా కనబడుతోంది. చంద్రబాబు హామీని నమ్మి మూడు నెలలుగా వాయిదాలు చెల్లించని వారి సొమ్మును బ్యాంకర్లు నేరుగా పొదుపు ఖాతా నుంచి జమ చేసుకుంటున్నారు. దీంతో మహిళలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. మరోపక్క బంగారం రుణాలు తీసుకున్న వ్యవసాయదారుల పరిస్థితీ గందరగోళంగా ఉంది. రుణమాఫీ హామీపై ప్రభుత్వం నేటికీ స్పష్టత ఇవ్వలేదు.. బ్యాంకర్లు మాత్రం బంగారం రుణాలపై వేలం నోటీసులు ఇస్తున్నారు.
     
    గుడ్లవల్లేరు : ఎన్నికల్లో రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా ఆడపడుచుల రుణాలు మాఫీ చేసి, అప్పుల వెతల నుంచి విముక్తుల్ని చేస్తానని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అమలు ప్రక్రియలో కమిటీ పేరిట జాప్యం చేస్తుండటంతో రైతులు, డ్వాక్రా మహిళలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుత ప్రభుత్వ లెక్కల ప్రకారం డ్వాక్రాలో 5.50 లక్షల మంది మహిళలు ఉన్నారు. 55 వేల గ్రూపుల వారు రూ.930 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది.

    బాబు హామీతో ఎన్నికల ముందు నుంచి రుణాలు రద్దవుతాయని చాలామంది మహిళలు కనీసం పొదుపు కూడా చెల్లించటం లేదు. మరోపక్క వారు తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో బకాయిలు మూడు నెలలు దాటిన డ్వాక్రా మహిళల ఖాతాల్లోని పొదుపు సొమ్మును బ్యాంకర్లు వడ్డీల కింద జమ వేసేసుకుంటున్నారు. ప్రతి నెలా ఐదోతేదీ లోగా రుణాలు చెల్లించకపోతే వడ్డీ రాయితీలు వర్తించవనే విషయం తెలిసినా చంద్రబాబు రుణమాఫీ హామీతో మహిళలు ఒకింత ధీమాగా ఉన్నారు. రుణాలు రద్దయ్యాక ఇంక రాయితీలతో పనేమిటనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమైంది. తీరాచూస్తే బ్యాంకర్లు పొదుపు నుంచి బకాయిలను జమ చేసుకుంటుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
     
    మాఫీపై నోరు విప్పని ప్రభుత్వం...
     
    రుణాల రద్దుపై బాబు ప్రభుత్వం నోరు విప్పకపోవటంతో రుణాలు చెల్లిద్దామన్నా తడిసి మోపెడైంది. ఎన్నికల ముందు నుంచి బకాయిలు అధికంగా పెరిగిపోయాయి. రుణాలు చెల్లించాలంటే మెడలో పుస్తెలు తాకట్టు పెట్టుకోవలసిన దుస్థితి కొన్ని కుటుంబాల్లో చోటు చేసుకుంది. దిక్కు తోచని స్థితిలో డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఇక రుణాల రద్దుపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని ఆందోళనకు గురవుతున్నారు.
     
    రుణాల రద్దుపై ఆదేశాలు రాలేదు :  డీఆర్‌డీఏ పీడీ

    ఈ విషయమై జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ పి.రజనీకాంతారావును వివరణ కోరగా జిల్లాలో ఆరువేల గ్రూపులు కొద్ది నెలలుగా రుణాలు చెల్లించటం లేదన్నారు. కొత్త ప్రభుత్వంలో రుణాల రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఇప్పటి వరకూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు నెలవారీ వాయిదాలు నిలిపివేసిన గ్రూపులు వెంటనే చెల్లించాలని మహిళలను కోరారు.
     
    బాబూ.. మాట పోషించుకో

    మాట పోషించుకోలేనపుడు ఎన్నికల్లో చంద్రబాబు డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానని ఎందుకు హామీ ఇచ్చారు? రుణాల్ని రద్దు చేయటంలో తాత్సారం చేస్తూ మహిళల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. ఆయన హామీని నమ్మి బ్యాంకు ఖాతాలకు రుణ బకాయిలు జమచేయకపోవడం వల్ల పొదుపు మొత్తం నుంచి రూ.3 వేలు ఈ నెలలో బ్యాంకు వారు జమ చేసుకున్నారు.     - చిట్టూరి రంగామణి, చిత్రం వీవో అసిస్టెంట్
     
     బాబు కట్టొద్దంటేనే చెల్లించలేదు...

     రుణాలు చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే అప్పులు రద్దు చేయిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పటం వల్లనే రుణ వాయిదాల్ని మా గ్రూపు చెల్లించలేదు. కానీ మా గ్రూపు పొదుపులో రూ.3 వేలను బ్యాంకు వారు జమ చేసుకున్నారు. రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చిన బాబు తన సొంత నిధులతో అయినా రుణమాఫీ చేయాల్సిందే.    
     - గోన ధనలక్ష్మి, చిత్రం డ్వాక్రా మహిళ
     
    బకాయిలు చెల్లించని బంగారం వేలమే

    కృత్తివెన్ను : ‘ఆడపడుచులారా కంగారు పడకండి.. మరికొన్ని రోజులు ఆగితే మేము అధికారంలోకి వస్తాం.. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం మీ ఇళ్లకు చేర్చుతాం’ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని లబోదిబోమంటున్నారు కృత్తివెన్ను మండల ప్రజలు. రుణమాఫీలో బంగారంపై ఉన్న బకాయిలు మాఫీ అవుతాయనుకున్న వారికి స్థానిక ఇండియన్ బ్యాంకు అధికారులు బకాయిలు చెల్లించకుంటే బంగారం వేలం వేస్తామని నోటీసు జారీ చేయడమే దీనికి కారణం. ఈ ప్రకటనతో బకాయిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కృత్తివెన్ను ఇండియన్ బ్యాంకులో బంగారంపై బాకీలు ఉన్న 65 మంది పేర్లను మేనేజరు వి.శ్రీనివాస్ నోటీసులో ప్రకటించారు. వీరి వద్ద నుంచి రూ.28.68 లక్షలు బకాయిలు ఉన్నాయని, త్వరలో చెల్లించని పక్షంలో పై అధికారుల సూచనలతో వేలం వేయనున్నామని పేర్కొన్నారు. రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమకు మొండిచేయే మిగలనుందా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement