వివాదాస్పదంగా మారిన మన్నాపురం క్వారీ వద్ద శుక్రవారం మళ్లీ రగడ చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు మరో మారు ఆధునిక పద్ధతుల్లో సర్వేకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డి , దీనిపై పిటీషన్ వేసిన వైఎస్సార్‌సీపి నియోజకవర్గ సమన్వయ కర్త కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మరోవైపు అక్కడి రైతులు క్వారీ వల్ల తమకు వస్తున్న ఇబ్బందులపై అధికారులను నిలదీశారు.
ధరూరు, న్యస్‌లైన్ : మంత్రి డీకే అరుణ కుమార్తె స్నిగ్దారెడ్డి పేరున నడుస్తున్న క్వారీ వద్ద శుక్రవారం మైనింగ్, సర్వే, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో మరోసారి సర్వే చేపట్టారు. మండల పరిధిలోని మన్నాపురం సమీపంలో ఉన్న గుట్ట వద్ద (సర్వే నెంబర్ 327, 135) రాయిని తీసుకునేందుకు మైనింగ్ శాఖ నుంచి ఒక హెక్టారును లీజుకు తీసుకుని అంతకంటే ఎక్కువగా తవ్వకాలు జరిపారని గతేడాదినవంబరు 11న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి హై కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై కోర్టు ఆదేశాల మేరకు జనవరి 29న మైన్స్ డై రెక్టర్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో క్వారీ వద్ద విచారణ జరిపి సర్వే నిర్వహించారు.
అప్పుడు హద్దులను ఏర్పాటు చేసిన అధికారులు తిరిగి శుక్రవారం క్వారీ వద్దకు చేరుకుని మరోసారి విచారణ చేశారు. ఆధునిక సామగ్రితో కచ్చితత్వాన్ని సాధించేందుకు వినియోగ పడుతుందని ఆ విధానంలో సర్వే చేపట్టినట్టు ఆ శాఖ జిల్లా ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గుట్టతో పాటు గుట్టకు చేరుకునే నలుమూలల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే వద్దకు పిటీషనరు తరపున ఐదుగురిని, క్వారీకి సంబంధించిన వారిని ఐదుగురిని మాత్రమే పంపారు. గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి, తహశీల్దార్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
మామా, అల్లుళ్ల మాటల యుద్ధం
మంత్రి డీకే అరుణ భర్త, మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి.. ఆమె మేనల్లుడు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డిలు ఈ సందర్భంగా పరస్పరం దూషించుకున్నారు. ‘నువ్వెంత...అంటే నువ్వెంత’ అనే రీతిలో ఇరు పార్టీల కార్యకర్తలు, పోలీసుల ముందే పత్రికలు రాయలేని విధంగా, తీవ్ర పద జాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యవహారమంతా గద్వాల సీఐ షాకీర్ హుస్సేన్ ఎదురుగానే జరగింది. వెంటనే తేరుకున్న సీఐ వారిద్దరినీ అక్కడి నుంచి పక్కకు పంపించారు. తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, న్యాయవాది షఫీఉల్లాల మధ్య కొంత సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.
తీసుకున్న దానికంటే కొసరుకున్నదే ఎక్కువ
- వైఎస్సార్ సీపీ కృష్ణమోహన్‌రెడ్డి
మన్నాపురం గుట్ట వద్ద మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నది హెక్టారే. కానీ నిబంధనలకు విరుద్ధంగా 40-50 ఎకరాల్లో తవ్వకాలు జరిపిన భరతసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. శుక్రవారం జరిపిన పర్వే నిష్పక్షపాతంగా ఉండాలి. పోలీసులు ఏ కపక్షంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు.
చుట్టుముట్టిన రైతులు
గుట్ట చుట్టు ఉన్న తమ పొలాల్లో బాస్టింగ్ కారణంగా దుమ్ము థూళి పేరుకుపోయి పంటలు పండని పరిస్థితి నెలకొందనీ ఏళ్ల తరబడిగా తాము వేసుకుంటున్న పంటలు చేతికందడం లేదనీ తమకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మన్నాపురం, సోంపురం గ్రామాల రైతులు తిరుగు ముఖం పడుతున్న అధికారులను చుట్టు ముట్టి నిలదీశారు. న్యాయం చేసేలా చూస్తామనడంతో వారు శాంతించారు.
మళ్లీ ‘గుట్ట’ సర్వే..!
Published Sat, Feb 8 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement