ముగిసిన బాబు యాత్ర
Published Sat, Sep 7 2013 4:20 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, గుంటూరు : తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో పూర్తయింది. గురజాల నియోజకవర్గం పొందుగల వద్ద ఆదివారం ప్రారంభమైన యాత్ర ఆరు రోజులపాటు కొనసాగి శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించింది. బాబు యాత్రకు తొలి రోజు నుంచి చివరి రోజు వరకు జిల్లాలో జనస్పందన కరువైంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబును అడుగడుగునా సమైక్యవాదులు అడ్డుకున్నారు.తనదైన శైలిలో యాత్రను కొనసాగించిన బాబు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతనే మూటగట్టుకున్నారు. ఈ విషయమై ఆది నుంచి భావించినట్టుగానే పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరకు అథోగతి యాత్రగా మారిందనే విమర్శలూ వినిపించాయి.
రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఎదురుచూసిన ప్రజలకు చివరి రోజు కూడా బాబు తనదారే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తూ జిల్లాను దాటివెళ్లారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఆచార్య శ్యామూల్, ఆచార్య పి.నరసింహారావు, డాక్టర్ వెంకటరమణ, కిషోర్‌తోపాటు విద్యుత్ జేఏసీ నేత రవిశేఖర్‌లు కంతేరు బస వద్ద చంద్రబాబును కలిసి మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు కృషిచేయాలని, ఉద్యమాలకు అండగా ఉండాలని కోరారు. అందుకు బాబు స్పందిస్తూ తాను రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల అభిప్రాయాలకు అనుగుణంగానే పనిచేస్తానని స్పష్టం చేశారు. అప్పుడు కూడా ఆయన సమైక్యాంధ్ర అనే పదం పలకకపోవడం గమనార్హం. ఆ తరువాత యాత్రలో ప్రసంగించిన చంద్రబాబు జిల్లాలోని కొండవీటి వాగు ఆధునికీకరణ, టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన వంటి అభివృద్ధి పనులు తన హయాంలో జరిగినట్టుగానే గొప్పలు చెప్పుకున్నారు.
దళితుల ఆగ్రహంతో ఉద్రిక్తత...
కంతేరు గ్రామంలో చంద్రబాబు ప్రసంగిస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై ఆరోపణలు చేయడంతో దళితవాడమిహ ళలు తీవ్రంగా స్పందించారు. బాబు మాట్లాడే తీరు అభ్యంతరకరంగా ఉందని ఆందోళన చేశారు. అదేవిధంగా నిడమర్రులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు చంద్రబాబు బసు దిగి రాకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం మంగళగిరి అంబేద్కర్ సెంటర్‌లో ఏపీఎన్జీవో జేఏసీ నేతలు సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ బ్యానర్‌లు, ప్లకార్డులు పట్టుకుని బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ సమయంలో బాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది పేరుతో పసుపు రంగు చొక్కాలు ధరించిన కొందరు కర్రలతో ఉద్యమకారుల్ని కట్టడి చేశారు. ఒకవైపు పోలీసు రోప్ పార్టీ, రాపిడ్‌యాక్షన్ బలగాలు, మరోవైపు బ్లాక్ క్యాట్స్‌తో పాటు పార్టీదళం కలిసి ఉద్యమకారుల్ని పక్కకు తోయడం, నెట్టడం విమర్శలకు దారితీసింది. తెలుగుప్రజల ఆత్మగౌరవయాత్ర పేరుతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు జిల్లాకు వచ్చినట్లు సమైక్య ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కృష్ణా జిల్లాలోకి ప్రవేశం..
తాడికొండ నియోజకవర్గం కంతేరు గ్రామం బస శిబిరం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన బాబు యాత్ర నిడమర్రు, బాపూజీ నగర్, నీరుకొండ శిబిరం, మంగళగిరి పట్టణంలోని అంబటినగర్, డోలాస్‌నగర్, ప్రకాశ్‌నగర్, నులకపేట, ముగ్గురోడ్డు, ఉండవల్లి సెంటర్, సీతానగరం, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాత్రికి కృష్ణా జిల్లా విజయవాడలోకి ప్రవేశించింది.
Advertisement