బస్సుయాత్రలో చంద్రబాబు వైఖరి
Published Thu, Sep 5 2013 4:59 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, గుంటూరు : రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఇక్కడకు వచ్చి జాతిని విచ్ఛిన్నం చేస్తే ఖబడ్దార్ అంటూ హూంకరించటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఢిల్లీలో జీ హుజూర్ అని, ఇక్కడ హెచ్చరికలు ఏమిటనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు.తెలుగు ఆత్మగౌరవం అంటూ బాబు చేపట్టిన బస్సుయాత్ర లక్ష్యం ఏమిటో అర్థంకాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నాలుగు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న బాబు విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ యాత్ర చేస్తున్నారా, లేఖ ఇచ్చిన తరువాత విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యం కోసం వచ్చారా అనేది తమకు అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. ఆయన ప్రసంగాల శైలి చూస్తే ఎన్నికలు రాకుండానే ఓట్ల కోసం వచ్చినట్టుందని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న బస్సుయాత్ర నాలుగో రోజు బుధవారం పెదకూరపాడు నియోజకవర్గంలో సాగింది. పెదకూరపాడు,అబ్బురాజుపాలెం, 75 త్యాళ్లూరు, లింగాపురం, ధరణికోట తదితర చోట్ల చంద్రబాబు మాట్లాడారు.
గొప్పలు చెప్పుకున్న బాబు...
ఈ రోడ్లు నేనే వేశా. తమ్ముళ్లూ మీకు ఉద్యోగాలు ఎవరిచ్చారు. రైతులూ ..నా పాలనలో ఏనాడైనా ఆందోళ న చేశారా. హైదరాబాద్ మహానగరాన్ని అందంగా తీర్చిదిద్దా. సైబరాబాద్ సృష్టికర్తను నేనే. అన్నింటి గురించి మాట్లాడే హక్కు నాకే ఉంది. నేనే గొప్ప, నా పాలనే గొప్ప...ఇలా సాగిన చంద్రబాబు ప్రసంగాలు తెలుగు తమ్ముళ్లకే కాదు, సామాన్యులకు సైతం విసుగుపుట్టించాయి. తన తొమ్మిదేళ్ల పాలనలో ఏర్పడిన కరువు కాటకాలు, కరెంటు ఉద్యమాలు, సాగునీటి అగచాట్లను పక్కన పెట్టి గొప్పలు పోతున్న బాబును చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
ఉద్యమ ప్రస్తావనే లేదు..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమం గురించి చంద్రబాబు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ప్రజలు సమస్య తన సమస్య కాదన్నట్టుగానే యాత్రలో సాగిపోతున్నారు. ఆయన వస్తున్న దారిలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ బ్యానర్‌లు, ప్లకార్డులు పట్టుకుని వేచి చూస్తున్న ప్రజలు, విద్యార్థుల వైపు కనీసం కన్నెత్తికూడా చూడటం లేదు. 75 త్యాళ్లూరులో వివేకానంద విద్యాసంస్థల విద్యార్థులు జై సమైక్యాంధ్ర బ్యానర్, ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు కాన్వాయ్‌కు ఇరువైపులా నిల్చొని నిరసన తెలిపినా ఆయన కన్నెత్తి చూడలేదు. ఎక్కడా కూడా సమైక్యాంధ్ర అనే మాట వాడకుండా చంద్రబాబు తన ప్రసంగంలో జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. తెలుగుజాతిని విచ్ఛినం చేస్తే ఖబడ్దార్ అంటు హెచ్చరిస్తున్నారు. దీంతో విభజనపై బాబు వైఖరి ఏమిటనేది స్పష్టం కావడం లేదని ప్రజలు అంటున్నారు.
జనస్పందన కరువు...
పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన యాత్రకు జనస్పందన కరువైంది. మధ్యాహ్నం 12.10 నిముషాలకు యాత్ర ప్రారంభించిన బాబు రెండు మూడు గ్రామాల్ని దాటగానే భోజన విరామానికి ఆగారు. ఈ సమయంలో బస్సు లోపలకు జిల్లా నేతల్ని పిలిపించుకుని జన సమీకరణ ఏదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలావుంటే జిల్లాలో యాత్ర ప్రారంభ రోజు నుంచి పులిచింతల ప్రాజెక్ట్‌కు బదులు పులివెందుల అనటం వెంటనే క్షమించాలని కోరి పులిచింతలని చెప్పడం బాబుకు పరిపాటిగా మారింది. తన ప్రతి ప్రసంగంలో పదే పదే ‘ఖబడ్దార్, జాగ్రత్త..’ అని ఎందుకు అంటున్నారో ప్రజలకు అర్థంకావడం లేదు.
Advertisement
Advertisement