- నామినేషన్ల పర్వం పూర్తి
- మొత్తం అభ్యర్థులు 333
- మూడు లోక్‌సభ స్థానాలకు 52
- 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 281
- స్వతంత్రులుగా ఆసక్తి కనబరిచిన యువకులు
- 21న పరిశీలన
- 23న ఉపసంహరణ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ పర్వంలో మొత్తం 333 మంది నామినేషన్లు సమర్పించారు. జిల్లాలోని 3 లోక్‌సభ స్థానాలకు 52 మం ది, 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 281 మం ది నామినేషన్లు దాఖలు చేశారు. 21న పరిశీలన, 23న ఉపసంహరణ ఉం టుంది. అనంతరం బరిలో ఉన్నది ఎవరన్నది నిర్ధారణ అవుతుంది.
మే 7న పోలింగ్,16న ఓట్ల లెక్కింపు ఉం టుంది. కాగా అప్పుడే రెబెల్స్‌ను బుజ్జగించడంతోపాటు ప్రచారానికి ఆ యా పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ఇంకా పది హేను రోజులే గడువున్నందున వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రత్యేక వాహనాల్లో వెళ్లి ఓటర్లను నేరుగా కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆయా అసెం బ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం పూర్తి చేశారు. రెండో విడతగా ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలిసే ందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
స్వీకరించని అనితా నామినేషన్
విశాఖ లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు అనితా సకురు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చారు. అప్పటికే సమయం దగ్గరపడడం, అలాగే బి-ఫారం లేకపోవడంతో ఆమె నామినేషన్‌ను అధికారులు స్వీకరించలేదు. ఆమె ఇప్పటికే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గంటా శ్రీనివాసరావు బి-ఫారం సమర్పించారు. ఈమేరకు అనితా సకురు స్వతంత్ర అభ్యర్థిగా మిగిలిపోయారు. ఇదిలా ఉంటే ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు అప్పుడే పార్టీ పెద్దలు చర్యలు చేపట్టారు. ఆమెను బుజ్జగించినట్లు సమాచారం.
లోక్‌సభకు భారీగా స్వతంత్రులు
జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖ ఎంపీ స్థానానికి స్వతంత్రులు పోటీ పడి నామినేషన్లు వేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా16 మంది స్వతంత్రులు పోటీకి ఉత్సాహం కనబరిచా రు. యువకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీగా నామినేషన్ కు అభ్యర్థులు రూ.25 వేలు దరావతు చెల్లించాల్సి ఉంది. అంత మొత్తం కట్టి మరీ భారీగా యువకులు, మహిళలు స్వతంత్రులుగా పోటీకి సన్నద్ధం కావడం సర్వత్రా ఆశ్చర్యం గొలుపుతోంది. ఈ నెల 23న ఉపసంహరణ అనంతరం ఎంతమంది ఉంటారన్నది నిర్ధారణ అవుతుంది.