
‘రహదారి’లో అగ్ర పథమే లక్ష్యం
అద్భుతమైన రహదారి వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను దేశంలో తొలి స్థానంలో నిలపటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- రూ.14 వేల కోట్లతో 26 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన రహదారి వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను దేశంలో తొలి స్థానంలో నిలపటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 26 వేల కిలోమీటర్ల మేర రోడ్లను తీర్చిదిద్దేందుకు రూ.14 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించబోతున్నామన్నారు. సోమవారం సాయంత్రం ఆయన రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీలు, సీఈలు, జిల్లాల ఎస్‌ఈలతో సమీక్షించారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లను భారీ ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో 2,700 కి.మీ.గా ఉన్న జాతీయ రహదారుల నిడివిని మరో 2 వేల కి.మీ. పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. అందులో తొలుత వెయ్యి కి.మీ. మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారన్నారు. తీవ్ర ట్రాఫిక్ చిక్కులతో సతమతమవుతున్న హైదరాబాద్‌లో సమస్య పరిష్కారానికి 45 కీలక జంక్షన్లను గుర్తించి వాటిల్లో ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్టు తెలిపారు.
ఇదే తరహాలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి పెద్ద పట్టణాలను కూడా గుర్తించామన్నారు. తొలుత వరంగల్ ప్రధాన రహదారిని ఆరులేన్లుగా మారుస్తున్నట్టు తుమ్మల తెలిపారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులను అనుసంధానించే క్రమంలో నదులపై నిర్మాణంలో ఉన్న వంతెనలను వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రోడ్లు భవనాలశాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.