సాక్షి, నెల్లూరు: హెలెన్ తుపాన్ రూపంలో జిల్లాకు ముప్పు ముంచుకొస్తోంది. తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పై-లీన్ తుపాన్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తుపాన్ శ్రీహరికోట-ఒంగోలు మధ్యలో కావలి వద్ద తీరం దాట నుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.
కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ బుధవారం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరినీ అప్రమత్తం చేశారు. ఇరిగేషన్, హెల్త్, వ్యవసాయశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఇప్పటికే గుంటూరు జిల్లా రెస్క్యూ టీంలు జిల్లాకు చేరుకున్నాయి. అవసరమైతే మరిన్ని బృందాలను రప్పించేందుకు చర్యలు చేపట్టారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తుపాన్ పరిస్థితిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ శ్రీకాంత్‌తో మాట్లాడారు.
నెల్లూరులోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం(0861-23311477,1331261) ఏర్పాటయింది. జిల్లా వ్యాప్తంగా 46 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. కావలి, బోగోలు, అల్లూరు, చిల్లకూరు, అల్లూరు, కోట, వాకాడు, చిట్టమూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం తదితర మండలాల్లోని తీరగ్రామాల నుంచి 25 వేల మందిని ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. భారీవర్షాలు కురిస్తే చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులను అలెర్ట్ చేశారు. కావలి డివిజన్ పరిధిలో బలహీనంగా ఉన్న చెరువు కట్టల వద్ద ఇసుకబస్తాలు సిద్ధం చేయాలని అధికారులను ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు ఆదేశించారు. మరోవైపు తీరప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తయ్యారు. పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు.
టెన్షన్..టెన్షన్
తుపాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పూరిళ్లు, రేకులిళ్లలో నివాసం ఉంటున్న వారితో పాటు అరటి, కొబ్బరితోటలు సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట, కోవూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో వందలాది ఎకరాల్లో అరటిపంట సాగవుతోంది.
గాలి తీవ్రతకు అరటిచెట్లు నేలమట్టమయ్యే ప్రమాదమున్నందున ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రొయ్యల రైతులకు కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. వెనామీ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తీరప్రాంతంలోని వేలాది ఎకరాల్లో రొయ్యలగుంటలు సాగుచేస్తున్నారు. కుండపోత వర్షం కురిస్తే గుంటలు తెగిపోయే ప్రమాదముంది. నీటిలో ఉప్పుశాతం తగ్గిపోయి సమస్యలు ఏర్పడుతాయని పలువురు రైతులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలే నారేతలు వేసుకున్న రైతులను ముంపు భయం వెంటాడుతోంది.
హడలెత్తిస్తున్న హెలెన్
Published Thu, Nov 21 2013 3:28 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement