హామీల అమలు వదిలేసి జగన్‌పై విమర్శలా?
బొజ్జల తీరుపై చెవిరెడ్డి ధ్వజం
తిరుపతి : ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై దృష్టిపెట్టకుండా వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వంటి సీనియర్ నాయకుడికి తగద ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిపై బొజ్జల చేసిన అవినీతి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో 11 చార్జ్‌షీట్లు దాఖలు చేసిన సీబీఐ ఒక్క అభియోగా న్ని కూడా నిరూపించలేదని, జగన్‌మోహన్‌రెడ్డి అవి నీతిపరుడని ఏ కోర్టూ చెప్పలేదన్నారు. అయితే గతం లో జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ పదేపదే ఆరోపించి తమకు అనుకూలమైన పత్రికల్లో పనిగట్టుకుని కథనాలు రాయించిన టీడీపీ నాయకులు మళ్లీ పాతపాట పాడుతున్నారని చెవిరెడ్డి విమర్శించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి 24 గంటలైనా గడవక ముందే చ ంద్ర బాబు మంత్రివర్గంలో ప్రాధాన్యం కలిగిన పోర్ట్‌పోలియో కోసమే జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసినట్లుందన్నారు. అమాసకు, ఆడికి ఒకసారి నియోజకవర్గం పక్క తొంగిచూసే గోపాలకృష్ణారెడ్డి గురించి, ఇసుక మాఫియాలతో ఆయనకు గల సంబంధాల గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ గాలిగోపురం కూలిపోతే నియోజకవర్గానికి చెందిన బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా గోపాలకృష్ణారెడ్డి ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
హుందాగా వ్యవహరించండి
సీనియర్ నాయకులుగా ఉన్న బొజ్టల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు లాంటి వారు హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. తొలి సంతకాలను సంతకాలకే పరిమితం చేసి ఏ ఒక్కటీ అమలు దిశగా చర్యలు చేపట్టని టీడీపీ పాలనపట్ల అప్పుడే ప్రజలు పెదవి విరుస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామేమోనని పశ్చాత్తాప పడుతున్నారన్నారు. వైఎస్. రాజశేఖరరెడ్డి తన తొలి సంతకంతోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలను రద్దు చేసిన సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని అంశాలకు సంబంధించి తొలి ఐదు సంతకాలు చేయడంకన్నా ‘ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నా.. క్షమించండి’ అంటూ రాసిన ఫైలుపై ఒకే ఒక సంతకం చేసి ఉంటే బాగుండేదని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి తాను అమలు చేయగలనన్న నమ్మకం ఉన్నవాటినే ప్రజలకు చెప్పారన్నారు. ప్రజలు వాస్తవాలను త్వరలోనే గ్రహించి వారిని ఛీకొట్టే రోజులు వస్తాయన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు, ప్రజాసమస్యలపై వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నపుడు వ్యవహరించినట్లే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పోత్ర పోషిస్తుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.