
పరిహారానికి కొత్త నిబంధనలు
- కొత్తచట్టం ప్రకారం నిర్వాసితులకు చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో నీటిపారుదల, రోడ్లు-భవనాల శాఖలు విడివిడిగా నిబంధనలను అమలు చేస్తూ వచ్చా యి. అయితే కేంద్రం తీసుకువచ్చిన ‘భూసేకరణ, సహాయ పునరావాస చట్టం-2013’ నేపథ్యంలో కొత్త నిబంధనావళి రూపకల్పన అనివార్యమైంది. ఈ మేరకు అన్ని విభాగాలకు ఏకరూపకత కల్పిస్తూ రోడ్లు, భవనాలశాఖ కొత్త నిబంధనలను రూపొం దించింది. వాటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ అమల్లోకి తెస్తూ.. బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త నిబంధనలివీ..
కోల్పోతున్న నిర్మాణం ప్రాథమిక అంచనా మొత్తం రూ. 4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింత్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. రూ. 4లక్షల కంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి, ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం లెక్కిస్తారు.
ఇంటి నిర్మాణం ఎప్పుడు జరిగిందో గుర్తించి.. దాని తరుగుదల లెక్కించేందుకు ప్రత్యేకంగా సంవత్సరాల వారీగా శాతాన్ని నిర్ధారించారు. గుడిసెలకు తరుగుదల వర్తించదు.
ఏదైనా ఇంటి నిర్మాణం జరిగిన సంవత్సరం వివరాలు అందుబాటు లేక, దాని జీవితకాలం విషయంలో స్పష్టత లేనప్పుడు రిజిస్ట్రేషన్ రికార్డులు, పంచాయతీ రికార్డుల ఆధారంగా అంచనా వేస్తారు. అందులోనూ వివరాలు లభించకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా పైర్యాంకు అధికారి స్థానికంగా విచారణ జరిపి అంచనా కడతారు.
ప్రైవేటు నిర్మాణాలు రోడ్లు, భవనాల శాఖ ప్రమాణాలను అనుసరించే పరిస్థితి ఉండనందున దాని నిర్ధారిత విలువలో 10 శాతం మొత్తాన్ని తగ్గిస్తారు.
నిర్మాణాలు అంతస్తుల వారీగా ఉండి, దిగువ అంతస్తు ప్లింత్ ఏరియాతో సమంగా పైఅంతస్థులు ఉన్నప్పటికీ దిగువ అంతస్తు నిర్మాణ అంచనా కంటే పైఅంతస్తు నిర్మాణాల విలువను 25 శాతం మేర తగ్గిస్తారు.
ప్రధాన నిర్మాణానికి, ప్రహరీ గోడకు విడివిడిగా విలువ లెక్కగడతారు.
కట్టడం విలువలో అందులోని కలప విలువ 25 శాతానికి మించితే.. ఆ కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 100 శాతం విలువను చెల్లిస్తుంది. ఒకవేళ యజమానే ఆ కలపను తీసుకుంటే దాని విలువలో 40 శాతం మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ కలపను మరోప్రాంతానికి తరలించాలంటే అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.