- అదనుకు అందించ లేకపోవడం బాధాకరం
- వేరుశనగ విత్తనాల పంపిణీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి
చంద్రగిరి : ఖరీఫ్ అదను దృష్టిలో ఉంచుకుని మరో రెండు రోజుల్లో అర్హులందరికీ వేరుశనగ విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రగిరి ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రభుత్వం రాయితీతో అందించే వేరుశనగ విత్తనాల పంపిణీ ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విత్తన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నియోజకవర్గంలోని చంద్రగిరి, తిరుపతి రూరల్, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం మండలాల అధికారులు, రైతులు కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరికీ త్వరగా విత్తనాలు అందించాలని చెప్పారు. ఉపాధి హామీని వెంటనే వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. పంటలపై సూచనలు, ఏ అదనుకు ఏ పంటలు వేయాలో ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు రైతులకు సూచించాలన్నారు. గ్రీవెన్స్‌డేలో వ్యవసాయ అధికారులు పాల్గొంటే రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
మంచి నిర్ణయాలకు ముందుంటా
ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా, సంక్షేమ పథకాలు అర్హులకు న్యాయబద్ధంగా అందేలా అధికారుల నిర్ణయాలు ఉంటే అలాంటి వాటిని సమర్థిస్తూ ముందుంటానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తాను నిబంధనలు అతిక్రమంచి పనులు చేయమనే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రాంతాలను, పార్టీలను చూసి పనులు చేయాలని చూస్తే ఒప్పుకోనన్నారు.
నిబంధనల ప్రకారమే అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రతి అధికారి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమస్యలు, ఇతర పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలపై చిన్నచూపు లేకుండా పనులు చేయించి పంపాలన్నారు. తాను ఎమ్మెల్యేగా కాకుండా మీలో ఒకడిగా ఉంటానని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమన్నారు. ఆదర్శరైతులకు నెలజీతం అందించడంలో ఆలస్యం మంచిది కాదన్నారు.
ఈ కార్యక్రమంలో నరసింగాపురం సింగిల్‌విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, ఎంపీడీవోలు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్ నారాయణ, పాకాల తహశీల్దార్ కృష్ణయ్య, అగ్రికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్లు వాసు, సౌభాగ్యలక్ష్మి, ఆరు మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు శంకర్‌లాల్ నాయక్, లక్ష్మీదేవి, మమత, నర్మద, మురళి, హరిత, ఆరు మండలాల రైతులు, అధికారులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, ఏవీ.రమణమూర్తి, దామినేటి కేశవులు, హేమేంద్రకుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వరలక్ష్మి, కోటీశ్వర్‌రెడ్డి, ఆనందభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ బుజ్జి, అగరాల భాస్కర్‌రెడ్డి, దేవారెడ్డి, మస్తాన్, లోక, ఎంపీపీ అభ్యర్థి కుసుమకుమారి, ఔరంగజేబు, ఎంపీటీసీ నాగరాజ, రైతు నాయకుడు ఆదికేశవులురెడ్డి, లత పాల్గొన్నారు.