
పుష్కరం మిగిల్చిన విషాదం
పర్వతాల రాజేశ్వరి, కొండూరు జానకమ్మ మృతదేహాలకు గోదావరి వద్దే పంచనామా చేసిన అనంతరం అధికారులు బుధవారం స్వస్థలానికి చేర్చారు.
‘క్యూలో మేమే ముందున్నాం. పవిత్ర స్నానం చేసే వరకు మంచినీళ్లూ ముట్టకూడదని వేచి ఉన్నాం. రాజేశ్వరికి అనారోగ్యంగా ఉండటంతో క్యూలో కూర్చొంది. ఆమె వద్దే చిన్న కూతురు కుసుమశ్వేత ఉంది. నేను, పెద్ద కూతురు అఖిల కొద్ది దూరంలో ఉన్నాం. ఉన్నట్లుండి పోలీసులు గేటు తెరిచారు. జనం ఒక్కసారిగా మీదపడ్డారు. రాజేశ్వరి, కుసుమశ్వేత కిందపడిపోయారు. నేను, అఖిల అరుస్తున్నాం. వారిని కాపాడేందుకు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశాం. జనంలో వీలు కాలేదు. కుసమశ్వేత తల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది. అమ్మా.. అమ్మా అంటూ కేకలు వేసింది. జనం తొక్కిసలాటలో రాజేశ్వరి ఊపిరాడక కళ్లెదుటే మమ్మల్ని విడిచి వెళ్లింది. కుసుమకు తీవ్రగాయాలయ్యాయి’ అని రాజేశ్వరి భర్త పోలయ్య ఆ విషాద ఘటనను కలెక్టర్‌కు వివరిస్తూ కన్నీటి పర్యంతయ్యారు.
‘మొదటగా పుష్కర స్నానం చేయాలనుకున్నాం. నేను, భార్య జానకి, వదిన సుబ్బులమ్మ నెల్లూరులో రెలైక్కి సోమవారం రాత్రి 10 గంటలకు రాజమండ్రి చేరుకున్నాం. వేకువజాము లేచి పుష్కర ఘాట్‌కు వెళ్లి నిల్చున్నాం. గేట్లు తెరిచేపాటికి ముందు వరుసలో ఉన్న మాపైకి జనం తోసుకుంటూ వచ్చారు. రెండు, మూడు సార్లు భార్య, వదినమ్మ కింద పడిపోతుంటే కాపాడాను. ఎలాగోలా ఆ ఇద్దరినీ స్నానం చేయమని నదిలో విడిచిపెట్టి నేను దూరంగా వచ్చాను. వారు నదిలోకి వెళ్లాక జనం ఒక్కసారిగా మీదపడ్డారు.
జానకమ్మ నీటిలో మునిగి ఆరగంట వరకు బయటకు రాలేదు. నేను వారి కోసం వెతికాను. అప్పటికే మృతదేహాలను తీసుకొస్తున్నారు. అది చూసి భయమేసింది. ఏం జరిగిందో.. నా జానకి ఎక్కడుందో అని ఆతృతగా వెతకడం ప్రారంభించాను. ఉదయం 10.30 గంటలకు జానకమ్మ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఒక్కసారిగా నా గుండె ఆగినంతపనైంది. ఏం చేయాలో దిక్కుతోచలేదు’ అంటూ లక్ష్మణ్‌రాజు కన్నీరు మున్నీరయ్యారు.
నెల్లూరు(క్రైమ్)/ఓజిలి : పర్వతాల రాజేశ్వరి, కొండూరు జానకమ్మ మృతదేహాలకు గోదావరి వద్దే పంచనామా చేసిన అనంతరం అధికారులు బుధవారం స్వస్థలానికి చేర్చారు. మృతదేహాలను అంబులెన్స్ నుంచి దించుతున్న సమయంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఆ ప్రదేశంలో బరువెక్కిన హృదయాలతో విషాదంగా మారింది.
కుటుంబాలకు ఓదార్పు
రాజేశ్వరి భౌతికకాయాన్ని కలెక్టర్ ఎస్ జానకి సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల చెక్కును మృతురాలి భర్త పోలయ్యకు అందజేశారు. భువనగిరిపాళెంలో జానకమ్మ భర్త లక్ష్మణ్‌రాజుకు రూ.10 లక్షల చెక్కును ఆర్డీఓ బాబయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం చేతులమీదుగా ఇచ్చారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర, విజయడెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనూరాధ రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించారు.
అంత్యక్రియలు
అశ్రునయాల మధ్య రాజేశ్వరి, జానకమ్మ అంతిమయాత్ర సాగింది. రాజేశ్వరి మృతదేహాన్ని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్టుకు చెందిన శకటంలో బోడిగాడితోటకు తరలించారు. జానకమ్మ మృతదేహానికి గ్రామస్తులు సంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించారు.