
ప్రజలకు అండగా నిలవాలి
రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ విషయంలో ఆ వర్గాల వారికి అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
హైదరాబాద్: రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ విషయంలో ఆ వర్గాల వారికి అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని, అలాంటి విషయాల్లో పార్టీ నేతలు నిత్యం ప్రజల వెన్నంటి ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ వాగ్దానాన్ని నెరవేర్చనందుకు నిరసనగా.. ‘నరకాసుర వధ’ పేరుతో ఇటీవల మూడురోజుల పాటు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు, పార్టీ అంతర్గత విషయాలపై బుధవారం జగన్ సమీక్ష నిర్వహించారు. 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. నరకాసుర వధ కార్యక్రమంలో రైతులు, మహిళలు స్వచ్చందంగా పెద్దయెత్తున పాల్గొన్నారని వారు వివరించారు.
పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకులను జగన్ అభినందించారు. గ్రామాల్లో రైతులు, మహిళలు రుణాల మాఫీపై తీవ్ర ఆందోళనతో ఉన్న విషయాన్ని పలు జిల్లాల అధ్యక్షులు పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ విషయంలో వారికి అండగా నిలిచి పోరాటాలు చేయాలని జగన్ సూచించారు. రుణ మాఫీ చేయకుండా రైతులు నష్టపోయేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయూన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీలో సంస్థాగతంగా చేయనున్న మార్పు చేర్పులను ఆయన వివరించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను తరచూ సమీక్షించేందుకు పార్టీ తరఫున ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుడిని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.
నేటినుంచి గుంటూరులో సమీక్షలు: ఇటీవలి సాధారణ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషించడానికి గురువారం నుంచి మూడురోజుల పాటు గుంటూరు జిల్లా సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.